”గత సర్కార్ తప్పుల తడక, కుంభకోణాల మయమంటూ విమర్శలు గుప్పిస్తున్నాడు. ఇదంతా చూస్తున్న కార్యకర్తకు అనుమానం వచ్చి తమ నేతను అడిగాడు. సార్ వాళ్లు మనల్ని బండబూతులు తిడుతుంటే ఎలా ఆస్వాదిస్తూ చూస్తున్నారు. ఆయన ఒక చిరునవ్వు విసిరి.. పిచ్చివాడా వాడు తిడుతున్నది నన్ను కాదు, రాజకీయాన్ని అని అన్నాడు. అర్ధం కానట్టు చూశాడు కార్యకర్త. నేడు పాలకుడికి ఉండాల్సిన లక్షణాల్లో ”ఆత్మస్తుతి పరనింద” ముఖ్యమైనవి. ఇవి లేకుంటే మనం రాజకీయాల్లో మనలేం” అని నాయకుడు కార్యకర్తకు హితభోద చేశాడు. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో ఇదే పదం బహుళ ప్రాచుర్యం పొందింది. ఎవరికి వారే ఎదుటి పక్షంపై దీన్ని ప్రయోగం చేస్తున్నారు. ప్రత్యర్థులపై రాజకీయ విమర్శనాస్త్రాలు సంధించే క్రమంలో ”ఆత్మస్తుతి పరనింద” అనే పదాన్ని అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ విరివిగా వాడుతోంది. గత కాలపు పాలన అవినీతిమయమని, సమస్యలను ఏకరువు పెట్టడడం, ప్రతిపక్షాలను తిట్టడం, మన పాలనని మనమే పొగుడుకోవడం, తద్వారా సమస్యని పక్కదారి పట్టించే క్రమంలో అధికార పక్షం ఈ పదాన్ని తరుచూ తమ ఖాతాలో వేసుకుంటున్నది. పదేండ్ల పాలన స్వర్ణ యుగమనీ, తామేమీ తప్పులు చేయలేదనీ, ప్రధాన ప్రతిపక్షం సైతం ఈ పదం యొక్క పేటెంట్ తమదే అన్నట్టు డంకాలు బజాయిస్తున్నది. తెలంగాణ శాసన మండలిలో శనివారం బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా ఈ పద ప్రయోగమే ఇరు పార్టీల వాదోప వాదాలకు కేంద్ర బిందువైంది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఆధోగతి పాలయిందనీ, దాన్ని గాడిలో పెట్టేందుకు అష్టకష్టాలు పడుతున్నామనీ, బడ్జెట్లో కాంగ్రెస్ చెప్పడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూధనా చారి ”ఆత్మస్తుతి, పరనిందా” అని కోడ్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఆది మీకే వర్తిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగారు. ”ఆత్మస్తుతి, పరనింద” రెండూ ఆత్మహత్యా సదృశ్యాలే అంటారు పెద్దలు. నిజాల్ని ఒప్పుకొని తప్పులు సరిదిద్దు కోవాలే తప్ప ఎదుటివారిపై తోసేస్తే ఎన్నికలప్పుడు ఈ పదం ఎవరికి వర్తిస్తుందో జనం తేలుస్తారు.
– ఊరగొండ మల్లేశం