ఆత్మస్తుతి, పరనింద!

 Sampadakiyamసోమవారం నాడు పదవీ బాధ్యతలు స్వీకరించిన అమెరికా 47వ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రసంగం, వెంటనే తీసుకున్న నిర్ణయాలు ఊహించిన విధంగానే ఉన్నాయి. ఇంకా అనేక అంశాల మీద వైఖరులు, ఆచరణను ప్రకటించాల్సి ఉంది. ప్రమాణస్వీకార సభకు వచ్చిన వారంతా వంది మాగధులు, లాభాలను ఆశించే కార్పొరేట్‌ శక్తులు, వారికి మద్దతునిచ్చే రాజకీయ నేతలే గనుక హర్షధ్వానాలు, ఆహా ఓహోలకు కొదవ లేకుండా సాగింది. అలాంటి వారిని అలరించేందుకు, మద్దతుదార్లను సంతుష్టీకరించేందుకు పలికిన పలుకుల సారం చూస్తే ఆత్మస్తుతి, పరనింద, ఎదురుదాడితో సాగిందన్నది స్పష్టం.’ నేటి నుంచి ప్రపంచంలో మరోసారి అమెరికాను గౌరవిస్తారు.ప్రతి క్షణం, ప్రతి రోజు అమెరికాను అగ్రస్థానంలో నిలుపుతా. స్వారభౌమత్వాన్ని, భద్రతను పునరుద్దరిస్తా.గతం కంటే బలంగా, గొప్పగా దేశం మారుతుంది. మరమ్మతు చేయటానికి వీల్లేని విధంగా సమాజ మూలస్తంభాలను గత పాలకులు దెబ్బతీశారు.విదేశాల సరిహద్దులను కాపాడేందుకు గత ప్రభుత్వం అపరిమిత నిధులు ఇచ్చింది తప్ప అమెరికా సరిహద్దులు, స్వంత జనాన్ని రక్షించేందుకు నిరాకరించింది. అమెరికాను మరోసారి గొప్పగా నిలబెట్టేందుకు హత్యాయత్నం నుంచి దేవుడు నన్ను రక్షించాడు. ఈ రోజు అమెరికన్లకు విముక్తి దినం.’ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఇలాంటివే ఎన్నో ఉన్నాయి.
గత ప్రభుత్వం తీసుకున్న వాటిలో 78 నిర్ణయాలను రద్దు చేస్తూ సంతకాలు చేశాడు. వాతావరణ మార్పులపై 2016లో కుదిరిన పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగటం వాటిలో ఒకటి. తొలిసారి 2017లో ఆ నిర్ణయం తీసుకున్నాడు. తరువాత అధికారానికి వచ్చిన జో బైడెన్‌ తిరిగి ఒప్పందంలో అమెరికాను చేర్చాడు. దాన్ని ట్రంప్‌ రెండోసారి తిరగదోడాడు. కాలుష్యం, భూతలం వేడెక్కకుండా చూసే బాధ్యత నుంచి వైదొలగటం అత్యంత బాధ్యతారహితం.కాలుష్యానికి కారణమైన దేశాల్లో అమెరికా ఒకటి. దానివలన సంభవిస్తున్న వ్యాధులు, ఆరోగ్య సమస్యల నివారణ నుంచి కూడా అది తప్పించుకోలేదు. అనారోగ్యం నుంచి కూడా లాభాలు పిండుకుంటున్న కార్పొరేట్‌ ఔషధ సంస్థలకూ అది నిలయమే. అలాంటి దేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి తప్పుకోవాలని ట్రంప్‌ సంతకం చేశాడు.
కరోనా సమయంలో ప్రపంచ మంతటా 70లక్షల మంది మరణిస్తే అత్యంత బాధ్యతా రహితంగా వ్యవహరిం చిన ఆ ‘పిచ్చివాడి’ కారణంగా అమెరికాలో పన్నెండు లక్షల ప్రాణాలు పోయాయి.తన వైఫల్యాన్ని మూసిపెట్టేందకు కరోనా కారకురాలు చైనా అని నిర్ధారించాలన్న ట్రంప్‌ ఒత్తిడిని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరాకరించిన కారణంగా తొలిసారి తన ఏలుబడిలో వైదొలిగాడు. పారిస్‌ ఒప్పందం మాదిరే బైడెన్‌ తిరిగి ప్రవేశించి అంతకుముందు మాదిరే నిధులు ఇచ్చాడు. ఇప్పుడు ట్రంప్‌ మళ్లీ మొదటికి వచ్చాడు.అమెరికా అంతర్గత అంశాలకు వస్తే ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ను స్తంభింప చేశాడు.
స్వర్ణయుగం ఇప్పటి నుంచే ప్రారంభమైందని ట్రంప్‌ వర్ణిస్తే, రారాజు తిరిగి వచ్చాడంటూ ఎలన్‌ మస్క్‌, సుందర్‌ పిచ్చరు, టిమ్‌ కుక్‌ వంటి వారు పొంగిపోయారంటే కార్పొరేట్‌ శక్తులు రెచ్చిపోతాయన్నది స్పష్టమే. దాన్ని మరోవిధంగా చెప్పాలంటే కార్మికవర్గం మీద దాడి పెరుగుతుంది. జో బైడెన్‌ ఎన్నికను అంగీకరించేది లేదంటూ 2021లో అమెరికా అధికార కేంద్రంపై దాడికి పాల్పడిన తన అనుచరులు 1500 మందిపై కేసులను ఉపసంహరించాడు, 14 మంది పచ్చి మితవాదులకు శిక్షలు తగ్గించాడు. మెక్సికో సరిహద్దులో అత్యవసర పరిస్థితి ప్రకటించి అక్రమంగా వచ్చేవారిని ఉగ్రవాదులుగా పరిగణించాలని ఆదేశించాడు. ఆర్కిటిక్‌ ప్రాంతంలో కోటీ 60లక్షల ఎకరాల్లో చమురు తవ్వకాలపై నిషేధాన్ని ఎత్తివేశాడు.ప్రపంచమంతా కాలుష్యం లేని హరిత ఇంథనం కోసం చూస్తుంటే చమురు కార్పొరేట్లకు అనుకూలంగా ట్రంప్‌ ముందుకు పోతున్నాడు. గతంలో ప్రత్యేకంగా జరిగిన మేలేమీ లేదు, అయినప్పటికీ ట్రంప్‌ రెండోసారి అధికారానికి వస్తే భారత్‌కు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా?
నరేంద్రమోడీతో ఉన్న స్నేహం దేనికి దారితీస్తుంది? అనే రీతిలో మనదేశంలో చర్చలు సాగుతున్నాయి. ట్రంప్‌ విధానాలు పూర్తిగా వెల్లడిగాకుండా వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. ఒక్క రోజులో ఉక్రెయిన్‌ పోరును ఆపుతానని చెప్పిన పెద్దమనిషి ఒక్క రోజులోనే మడమతిప్పి అంతా పుతినే చేస్తున్నాడంటూ ధ్వజమెత్తాడు. అందుకే అతడు ఎప్పుడేం మాట్లాడుతాడు, ఏం చేస్తాడని ప్రపంచమంతా ఎదురు చూస్తున్నట్లుగానే మనపట్ల వైఖరి గురించి మనకూ ఆసక్తికరమే!