సెల్ఫీ అంటే ఎవరి ఫొటో వాళ్ళు తీసుకోవడం. ఇక పక్కనున్నవాళ్ళు, స్థలాలు కూడా పడతాయందులో. ఈ సెల్ఫీలో కుడి ఎడమగా, ఎడమ కుడిగా కనిపిస్తుంది. ఎందుకంటే సెల్లు వెనుకనున్న కెమెరాకు బదులుగా ముందరున్న దానితో తీస్తారు కాబట్టి. కొన్ని సెల్లుల్లో అది మామూలుగానే వస్తుంది. అదంతా టెక్నాలజీకి సంబంధించిన అంశం. ఏమన్నా అంటే కుడి ఎడమైతే పొరబాటులేదోరు అంటారు. కుడి ఎడమల దగా దగా అన్నాడు ఓ కవి. కాబట్టి రెండూ ఒకటే కొన్ని విషయాల్లో.
సూర్యుడి మీద పరిశోధనకు పోయిన ఆదిత్య భూమి, చంద్రుడు వచ్చేలా ఒక ఫొటో తీసి పంపింది. తన సెల్ఫీ కూడా పంపింది. ఒక గ్రహం తన మీదినుండి నవగ్రహాలకూ సెల్ఫీ తీసిందనుకుందాం మనం పంపిన ఆదిత్య. వెనుకనున్న గ్రహాలు కాని గోళాలు మమ్మల్ని గ్రహాల్లో కలిపారెందుకు ఇవేనా మీచదువులు అని అడగొచ్చు. మా చదువులే కాదు మా ఆచారాలు, వ్యవహారాలు అన్నీ ఇంకా ఇంకా వెనక్కి వెనక్కి తీసుకుపోయున్నాము అన్నప్పుడు మరి చేతిలో ఈ కొత్త సెల్లు ఎందుకు అని ప్రశ్నిస్తే అన్ని యాపులు, గ్రాఫిక్సు దీనిలోనే కదా ఉండేది, వాటిని ఉపయోగించి వెనక్కి ఎలా పోవాలో తెలుసుకుంటున్నాము అనే సమాధానం రావచ్చు.
సెల్ఫీలు రాక ముందు కెమెరాకు సమయం పెట్టి తీసుకునేవాళ్లు ఫొటోలు. కొన్ని సెకన్ల తరువాత అది క్లిక్కుమని కొట్టే లోపు ఫొటో తీస్తున్న మనిషి గ్రూపులో నిలబడాలి. మనిషి లేకుండానే రొబోలతో పనులు చేయిస్తూ, ఎ.ఐ. ఆధారంగా అంటే కృత్రిమ తెలివితో వాహనాలు నడపడం, వంట చేయడం, విద్యార్థులకు క్లాసులు చెప్పడం మొదలైనవన్నీ కూడా చేయిస్తున్న రోజులు. ఇలాంటివాటితో పోల్చితే సెల్ఫీ అంత పెద్దదేమీ కాదనిపిస్తుంది. ఓ నాయకుడు తన సెల్ఫీ తీసుకుంటుంటే అనుకోకుండా ప్రతిపక్ష నేత వెనుకనుండి వచ్చాడనుకుందాం. మార్యాద కోసమన్నా అతణ్ణి కూడా తీయాలి ఫొటోలో. లేకుంటే సభ్యత ఉండదు. ఒకానొక కాలంలో పెద్ద నాయకుడితో ఫొటో దిగుదామన్నా వీలులేని రోజుల్లో కనీసం సెల్ఫీ అన్నా దిగుంటే బాగుండేది అనుకునే రోజులు పోయి ఆయన నమస్కారం పెడుతున్నా పట్టించుకోకుండా ముందుకు పోయే రోజుల్లో ఉండే నాయకుణ్ణి ప్రజలు గమనిస్తుంటారు.
ఎన్నికల సెల్ఫీ తీసిన నాయకుడికి రాష్ట్రాల ఎన్నికలు, కేంద్రంలో ఎన్నికలు రెండూ వస్తాయి దాంట్లో. రాష్ట్రాల ఎన్నికల సెల్ఫీలో కేంద్రం, కేంద్ర ఎన్నికల సెల్ఫీలో రాష్ట్రం కనిపిస్తాయి. అంటే రెండు ఎన్నికలు ఒకేసారి రావడం తనకిష్టమని నాయకుల ఆలోచనగా గుర్తుపెట్టుకోవాలి. ఈసారి ఎన్నికల్లో ఎవరితో కలవాలి, ఎవరితో కలవ కూడదు ఏయే రాష్ట్రాల్లో ఎలా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటే ఓ ఐడియా వచ్చినట్టుగా ఆ రాష్ట్రంలో మన నాయ కులు దిగిన సెల్ఫీలు పంపండి చూస్తాం అంటే పంపారనుకుందాం. సినిమా నాయకుడేమో మిత్రుడు, మిత్రునికి మిత్రుడు మిత్రుడే. శత్రువుకు శత్రువు శత్రువా మిత్రుడా అన్న అనుమానం వస్తుంది. తమాషా ఏమిటంటే శత్రువు లిద్దరూ ఒకరికొకరు శత్రువులే కాని తనకు మిత్రులు. సెల్ఫీల్లోనూ అదే తేలుతుంది. అందుకే వాటిని వదిలిపెట్టి ఇంకో మార్గం వెదుక్కోవాలి. ఈ సెల్ఫీల్లో మన ఎడమపక్క ఉన్నవాళ్ళు శత్రువులు కుడి పక్క ఉన్నవాళ్ళు మిత్రులు అని చెప్పేసి సహాయకుడు వేరే పనిమీద పోయాడనుకుందాం. అవి ఎడిట్ చేసిన సెల్ఫీలా లేదా తారుమారుగా చూపించే సెల్ఫీలా అని అనుమానం వస్తే ఇంకా ప్రమాదం.
హాయిగా కెమెరాలో నలుపు తెలుపు లేదా రంగుల రీల్ వేసుకొని ఫొటోలు తీసుకున్న కాలమే మేలు రీలు లేని, ఫ్రింటు తీసుకోని ఫొటోలు ఎక్కువైపోయి స్టోరేజి అంతా నిండిపోతుందని జనాలు బాధపడే కాలం. ఫొటోలు ఎక్కువవుతున్నాయి కాని మిత్రులు తక్కువవుతున్నారు అనే బాధ కనిపిస్తుంది. ఫొటోల్లోని మొహాల్లో ఉత్తుత్తి నవ్వే కాని నిజమైన నవ్వులు లేవు. కృత్రిమ మేధ అనే తెలివిని ఉపయోగించి ఏడుపు మొహం ఉన్నవాళ్ళ మొహాలను నవ్వే మొహాలుగా, నవ్వుతున్న మొహాలను ఏడ్చేవిగా కూడా చేయవచ్చు. మానవుని తెలివి రోబోల్లోకి పోయి వాటి తెలివి మానవుల్లోకి వస్తోంది.
ఇకపోతే ఇండియా అన్న పేరున్న పటం ముందు నిలబడి సెల్ఫీ తీసుకుంటే అది కాస్తా భారత్ అని కనిపించవచ్చు. అదేమిటి ఇండియా అన్నా భారత్ అన్నా మన దేశమే కదా అన్న అనుమానం రావచ్చు. కాని అటువంటి సందేహాలు మామూలువాళ్ళకు రాకూడదు. నాయకులకే రావాలి. సరే మనకి ఎవరో పెట్టిన పేరు, ప్రతిపక్షాల కూటమి ఇండియా కాబట్టి భారత్ అని చేశారనుకుందాం. బిల్లు పాస్ ఐపోయి పేరు భారత్ అని మారిపోయినాక ఆ ప్రతిపక్ష కూటమి తన ఇండియా అన్న పేరుని భారత్ అని మార్చుకుంటే పరిస్థితేంటి అధ్యక్షా…? అప్పుడు మళ్ళీ సమావేశాలు మళ్ళీ కొత్త బిల్లా…!!
జంధ్యాల రఘుబాబు
9849753298