…అమ్మే!

...అమ్మే!నువ్వేమైనా చెప్పు
మనిషి అంటే అమ్మే! ఆ అమ్మే మహా మనీషి!

కాల్చిన మంటకు వెరవకుండా,
కరిగిన వెన్నై, కాలం వడిలోకి
కడుపు నింపి పంపేది ఆమెగా.

నిద్రపుచ్చేది కాదు,తను మేల్కొని,
సూర్యోదయాన్ని వీనులవిందు చేసే
గానామృతమేగా ఆమె.

వేసారని వంటా వార్పు తప్ప
ఎప్పుడైనా, ఎక్కడైనా దేనికైనా
వెదుకాడిందా, వెంపర్లాడిందా ఆమె…

ఒడిలోని పిల్లను వడివడిగా ఎదిగించి,
ఒడినింపే వరకు కడతేరనని,
కడవరకు భీష్మించుకునేది అమేగా.

నన్నింత తీర్చిదిద్దడానికి
నాకన్నీ కూర్చిపోయడానికి ఎన్ని వేటలను,
కనిపించని మరెన్ని ఈటెలను
ఎదుర్కుందో కదా ఆమె.
నువ్వేమైనా చెప్పు
మనిషి అంటే అమ్మే! ఆ అమ్మే మహా మనీషి!

ఎన్నిసార్లు ఒంటరవ్వలేదు!
ఊరు మార్చినా, పేరు మార్చినా,
నన్ను మోస్తూ, నాన్నను చూస్తూ,
సుడిగుండాలను దాటి
సముద్రాన్ని చేరే తరంగిణియేగా ఆమె!

అమ్మకు కష్టం వస్తుంది,
ఆ కష్టానికి కన్నీళ్లుంటాయి,
అవి ఇట్టే ఇంకిపోయే ఒకే ఒక మందు
మన చిరునవ్వు.

ఒంటరైనా, ఓర్పు లేకపోయినా,
కూర్పు చేయలేకపోయినా,
ఎన్ని వేళ్లు తన వైపు లేస్తాయోగా…
నివ్వెర పోకుండా నీరసపడకుండా
కర్తవ్యానికి కంకణబద్దురాలైనమూర్తి కదా ఆమె..

వేర్పాటులలో, విడాకులలో,
ఎన్ని పాట్లున్నా, మనుషుల అలవాట్లనే తప్ప
వారిని దూరం కానివ్వని
మహాగుణం మరెవరిది.

భక్తికి, అనురక్తికి, ముక్తికీ మాతృత్వానికి,
మరెవరైనా పోటీ పడగలరా…

చీరకట్టినా, కొంగు నడుముకు జుట్టినా,
కొడవలి చేపట్టినా, పిడికిలి పైకెత్తినా,
సవాలు సైతం దాసోహం అనేది ఆమెకేగా.
శాస్త్రం చదివినా, శాంతం నేర్పినా,
సమస్యను చేదించినా, సంఘం నిర్మించినా,
ఆమెకు ఎవరు సాటిలే…

నువ్వేమైనా చెప్పు
మనిషి అంటే అమ్మే! ఆ అమ్మే మహా మనీషి!
– జి.సునితారాణి, 9951300016