– తప్పుడు ప్రకటనలతో మోసం
– నకిలీ డాక్టర్ క్లినిక్ సీజ్
– కొనసాగుతున్న డీసీఏ దాడులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. డ్రగ్ కంట్రోల్ అధికారులు వరసగా చేస్తున్న దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. నిర్దేశించిన ధరలకు మందులను అమ్మడం లేదు. పని చేయని వాటిని రోగాలను నయం చేసే మందులంటూ తప్పుడు ప్రకటనలతో అంటగడుతున్నారు. అర్హత లేకున్నా ఇష్టానుసారంగా క్లినిక్‌లు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారులు తాజాగా మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా శామీర్ పేటలోని ఒక మెడికల్ షాపులో నిర్వహించిన దాడిలో టెస్ట్ర్రా-200 క్యాప్సుల్స్ (10 క్యాప్సుల్స్)కు అదనంగా రూ.50 వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. కంటి జబ్బుకు చికిత్స పేరుతో అమ్ముతున్న పి-మైసెటిన్ (అల్లోపతిక్ మెడిసిన్), జ్వరానికి చికిత్స అంటూ అమ్మకాలు చేస్తున్న ఆయుర్వేదిక్ మెడిసిన్ మహసుదర్శన్ కదను సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం, గచ్చిబౌలిలో అర్హత లేకుండా క్లినిక్ నడుపుతున్న స్వరూప ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌పై దాడి ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.