అవును
యుద్ధంలో అమ్మతనం
ఆహుతయ్యింది.
అప్పటివరకు
హాయిగా ప్రశాంతంగానే వున్నాం.
నిద్ర, లేవటం, భోజనం, బాక్స్‌లు, స్కూళ్లు, పని
అన్నీ మామూలుగానే…
ఇంతలో ఏమి ముంచుకొచ్చిందో తెలియదు.
దేశం మీద మరో దేశం
యుద్ధ ప్రకటనలు
నిరంతర భీకర యుద్ధాలు
బాంబుదాడులు
క్షిపణుల దాడులు
అంతరిక్ష దాడులు
ఇండ్లపై, స్కూళ్లపై
ఆస్పత్రులపై, ప్రార్థనా స్థలాలపై
ఒకటేమిటి?
ఏదీ వదిలిపెట్టలేదు.
ఎవరినీ వదిలిపెట్టలేదు.
స్త్రీలు, పురుషులు,
పసికందులు, వృద్ధులు
బాంబులు
ఎవరిని వదిలిపెట్టాయని
బాంబులు-
ఎవరిపై దయతలచాయని
అమ్మలు
తొమ్మిది నెలలు
కడుపున మోసి కన్న
తమ పసికూనలు
కండ్లముందే, కండ్లనిండా కన్నీళ్లతో
ప్రాణాలు కోల్పోతుంటే
అకారణంగా, అమానవీయంగా
శిక్షింపబడుతుంటే
తామూ బలవుతూ
నిస్సహాయంగా గజగజలాడుతూ
చూస్తున్న తల్లులు-
తమముందే తమ
ముద్దుల పిల్లల మరణాలు-
యుద్ధంలో
ఏదేశం గెలుస్తుందో
ఏది ఓడుతుందో
కాలం నిర్ణయించలేదు.కాని
అమ్మతనం మాత్రం
ఓడిపోయింది.
మొగ్గలు తొడుగుతున్న
తరాన్ని కోల్పోయింది.
మరి ఇది
యుద్ధ విజయమా? ఓటమా?
– తుర్లపాటి లక్ష్మి
9704225469