– డీసీఏ దాడుల్లో పట్టివేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ మలక్‌పేట జడ్జెస్ కాలనీలో ఉన్న హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సదరు ఆస్పత్రిలో అధిక ధరలకు మందులను విక్రయి స్తున్నట్టు గుర్తించారు. బిల్లులను, మందులను స్వాధీనం చేసుకుని ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్, 1955, డ్రగ్స్ (ప్రైస్ కంట్రోల్) ఆర్డర్, 2013 కింద కేసు నమోదు చేశారు. జోఫర్ ఇంజెక్షన్‌తో పాటు ఏడు రకాల మందులను నిర్దేశించిన ధర కన్నా ఎక్కువగా అమ్మినట్టు సేల్స్ బిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మందులను విక్రయిస్తున్న మెడికల్ షాపు ఆ ఆస్పత్రి ప్రాంగణంలోనే ఉన్నది. విశ్వసనీయ సమాచారం మేరకు హన్మకొండ ఎల్కతుర్తి మండలం, గోపాలపూర్ గ్రామంలో రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ గా చెప్పు కుంటున్న నకిలీ వైద్యులు చిదురాల మార్కండేయ, శ్రీపతి మధుకర్ క్లినిక్కులపై అధికారులు దాడి చేశారు. డ్రగ్ లైసెన్స్ లేకుండా మందులను నిల్వ ఉంచినట్టు గుర్తించారు. చిదురాల నుంచి 25 రకాలు, శ్రీపతి నుంచి 17 రకాల మందులను స్వాధీనం చేసుకు న్నారు. వీటి విలువ రూ.27 వేలు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఫుడ్ లైసెన్స్ తీసుకుని తయారు చేసిన మెడ్ ఫోర్డ్-ఎక్స్‌టి టాబ్లెట్లను మెదక్ జిల్లాలో పట్టుకున్నారు. వీటిని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఐడీఏ ఉప్పల్, ఎల్.ఎన్.కాలనీలోని క్రియేటివ్ న్యూట్రిషన్స్ తయారు చేస్తున్నది. ఉత్తరాఖండ్‌లోని టెస్కో ఫార్మా మార్కెటింగ్ చేస్తున్నది. డ్రగ్‌లైసెన్స్ కింద మాత్రమే దీనిని ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కంటి ఇన్ఫెక్షన్లకు చికిత్సకంటూ తప్పుడు ప్రచారం చేస్తూ అమ్ముతున్న సాఫ్ట్ మైసిటిన్ క్లోరంఫెనికాల్ ఐ ఆయింట్‌మెంట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ మండలం, జిల్లెలగూడ గ్రామంలోని ఒక మెడికల్ షాపులో పట్టుకున్నారు.