– చాంపియన్స్ ట్రోఫీ బెర్త్‌లు సైతం
దుబాయ్ : 2023 ఐసీసీ ప్రపంచకప్ రసవత్తర సమరాలు, సంచలన ఫలితాలతో సాగుతోంది. పది జట్లు పోటీపడుతున్న మెగా ఈవెంట్ గ్రూప్ దశలో టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఈ ప్రపంచకప్ గ్రూప్ దశ సమరం సెమీస్ బెర్త్‌కే పరిమితం కాదు. అంతకుమించి.. అని ఐసీసీ ఎప్పుడో తేల్చేసింది. అవును, టాప్-4లో నిలిచే అవకాశం లేదని దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రపంచకప్‌లో టాప్-7లో నిలిచిన జట్లు 2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి నేరుగా అర్హత సాధించనున్నాయి. గతంలో వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగా అర్హత నిర్ణయించగా.. ఐసీసీ ఆ నిబంధనల్లో మార్పులు చేసింది. అసలు ప్రపంచకప్‌కు అర్హత సాధించని వెస్టిండీస్, జింబాబ్వే, స్కాట్లాండ్‌లు చాంపియన్స్ ట్రోఫీపై ఆశలు వదులుకోవాల్సిందే. దీంతో పాయింట్ల పట్టికలో దిగువన నిలిచిన జట్లు సైతం టాప్-7లో నిలిచేందుకు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధం కానున్నాయి. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై విజయంతో పాకిస్థాన్ విజేతగా నిలిచింది. 2025 చాంపియన్స్ ట్రోఫీకి డిఫెండింగ్ చాంపియన్ పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది.