మా రాష్ట్రానికి బియ్యాన్ని పంపండి

– మంత్రి ఉత్తమ్‌తో చర్చించిన కేరళ మంత్రి అనిల్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న బియ్యాన్ని కేరళ అవసరాలను తీర్చేందుకు వీలుగా అక్కడకు పంపాలని ఆ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి జీ.ఆర్‌.అనిల్‌ కోరారు. ఇదే విషయమై ఆయన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో చర్చించారు. హైదరాబాద్‌కు విచ్చేసిన అనిల్‌ శుక్రవారం సచివాలయంలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ, కేరళ రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగేలా పరస్పర సహకరించుకునేలా ఒప్పందం చేసుకునేందుకు ఉన్న అవకాశాలపై వారిద్దరూ చర్చించారు. వీటి సాధ్యాసాధ్యాలపై చర్చించి కార్యాచరణ ముసాయిదా ప్రణాళికను సిద్ధం చేయాలని పౌరసరఫరాల కమిషనర్‌ డీ.ఎస్‌.చౌహన్‌ను మంత్రి ఉత్తమ్‌ ఆదేశించారు. ఇందుకోసం కేరళ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డాక్టర్‌ డి.సుజిత్‌ బాబుతో చర్చించాలని సూచించారు. ఒప్పందం కుదిరితే ఇరు రాష్ట్రాలకు మేలు కలుగుతుందనీ, అదే సమయంలో కేరళ రాష్ట్రంలో అధికంగా వస్తున్న ఆహార ఉత్పత్తులను తెలంగాణకు వాడుకునేందుకు వీలుంటుందని తెలిపారు.