– దేశంలో కేరళ తరహా పాలన అందిస్తాం : తెల్దారుపల్లి సభలో విజయరాఘవన్
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
భవిష్యత్తు కమ్యూనిస్టులదేనని సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు విజయరాఘవన్ అన్నారు. పాలేరు సీపీఐ(ఎం) అభ్యర్థి తమ్మినేని వీరభద్రం విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు, పొన్నెకల్లు, మద్దులపల్లి, తెల్దారుపల్లి గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్దారుపల్లి గ్రామ ప్రజలు తమ్మినేనికి భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. తమ్మినేని వెంకట్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయ రాఘవన్ మాట్లాడుతూ.. తెల్దారుపల్లిని చూస్తుంటే నాకు మరో కేరళను చూస్తున్నట్టు ఉందన్నారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీకి ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులేనని తెలిపారు. నిజాయితీపరుడైన తమ్మినేనిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ప్రజలను కోరారు. గతంలో తమ్మినేని, తాను పార్లమెంట్‌లో పని చేశామని, పార్లమెంట్‌లో అతని వాక్చాతుర్యానికి చాలామంది మంత్రముగ్దులయ్యారని తెలిపారు. తాము అధికారంలో కొస్తే కేరళ మోడల్‌ను దేశమంతా అమలు చేస్తామన్నారు. సీపీఐ(ఎం) నాయకులు అసెంబ్లీలో, పార్లమెంట్‌లో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని మలయాళంలో హర్షద్వానాల మధ్య తెలిపారు.సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని మాట్లాడుతూ.. తెలంగాణ కమ్యూనిస్టుల కంచుకోట అని, అలాంటి రాష్ట్ర అసెంబ్లీలో కమ్యూనిస్టు అభ్యర్థులు ఉండాల్సి అవసరం ఎంతో ఉందన్నారు. తెల్దారుపల్లి గ్రామం రజాకారులను తరిమికొట్టిన గడ్డని, అటువంటి గడ్డలో మరో పార్టీకి అవకాశం ఇవ్వొద్దని ప్రజలంతా సోదరభావంతో మెలగాలని, చిన్నచిన్న లోపాలు ఉంటే సరి చేసుకోవాలని ప్రజలకు తెలిపారు. మహాజన పాదయాత్ర పేరుతో 4200 కిలోమీటర్లు రాష్ట్రం మొత్తం తిరిగి చరిత్ర సృష్టించినట్టు గుర్తుచేశారు. సీపీఐ(ఎం)కి కొంతకాలంగా దూరంగా ఉంటున్న వ్యక్తులు మడిపల్లి వెంకన్న, పగిడిపల్లి ఉపేందర్, చాట్ల రాము, పాము వెంకన్న, పాము బాబు, టేకుమట్ల సీతమ్మ, గజ్జి భారతమ్మ పలువురు తమ్మినేని సమక్షంలో ఎర్రజెండా కప్పుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు యం.సాయిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రమేష్, మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.