– విభజించి పాలిస్తున్న బీజేపీ
– ప్రజలపై భారాలేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
– 9 ఏండ్లలో పెరిగిన నిరుద్యోగం
– దళితులకిచ్చిన హామీల అమలులో బీఆర్‌ఎస్ విఫలం: ఖమ్మం రోడ్ షోలో త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఈ ఎన్నికలు తెలంగాణకే కాదు దేశానికీ అతి ముఖ్యమైనవిగా భావించాలని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ తెలిపారు. దేశాన్ని విభజించి పాలించే రీతిలో బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. స్వతంత్ర వ్యవస్థను అణచివేస్తుందని తెలిపారు. అందుకే బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలోనూ ఈ రకంగా ముందుకు వచ్చామన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల తొమ్మిదేండ్ల పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగిత బాగా పెరిగాయన్నారు. ఖమ్మం నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థి యర్రా శ్రీకాంత్ విజయాన్ని కాంక్షిస్తూ త్రీటౌన్‌లో శుక్రవారం నిర్వహించిన రోడ్ షోకు మాణిక్ సర్కార్ హాజరయ్యారు. ముందుగా ఖమ్మం గాంధీచౌక్‌లో ప్రారంభమైన రోడ్ షో 3 టౌన్ వ్యాప్తంగా కొనసాగింది. అనంతరం స్థానిక బోస్ బొమ్మ సెంటర్‌లో మాణిక్‌సర్కార్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రశ్నించే కమ్యూనిస్టులను అసెంబ్లీకి పంపాలని కోరారు. దేశంలో వ్యవసాయదారులు, కూలీలు, కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు చేసిన బీజేపీని ఓడించాలనే నినాదంతో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 19 స్థానాల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులను అసెంబ్లీకి పంపితే ప్రజాస్వామ్య హక్కులకై నిలబడతారనీ, ప్రభుత్వాల అవినీతిని ప్రశ్నిస్తారని తెలిపారు. 50 ఏండ్లలో పెరిగిన నిరుద్యోగం కంటే బీజేపీ పాలనలోని ఈ తొమ్మిదేండ్లలో గణనీయంగా పెరిగిందని ఆరోపించారు. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజల్లో కొనుగోలు శక్తి బాగా తగ్గిందన్నారు. దేశాన్ని విభజించి పాలించాలనే యోచనతో ఉన్న బీజేపీ.. కుల, మత విద్వేషాలను రెచ్చగొడుతుందని చెప్పారు. ప్రజా పోరాటాలను అదుపు చేయలేక పౌర హక్కులను అణచివేస్తుందని, రాజ్యాంగం పైనా దాడి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి బీఆర్‌ఎస్ పాలన కూడా ఏమాత్రం మినహాయింపు కాదన్నారు. రాష్ట్రంలోనూ నిరుద్యోగిత బాగా పెరిగిందని, షెడ్యూల్ కులాలకు ఇచ్చిన హామీలను నిలుపుకోవడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలిపారు. విద్యా వైద్యం.. ప్రయివేటు, కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిందని చెప్పారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం అణచివేస్తోందని, మీడియానూ స్వేచ్ఛాయుతంగా పనిచేసుకోనివ్వడం లేదని ఆరోపించారు. 40 ఏండ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న యర్రా శ్రీకాంత్‌ను గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చారు.
సీపీఐ(ఎం) ప్రజలను నమ్మితే.. ఇతరులు డబ్బులను నమ్ముకున్నారు : పోతినేని సుదర్శన్
సీపీఐ(ఎం) ప్రజలను నమ్మితే ఇతర పార్టీలు డబ్బును నమ్ముకున్నాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు. రూ. రెండు, మూడు వేల చొప్పున పంపకాలు మొదలయ్యాయని, అదంతా కష్టజీవుల సంపదేనని తెలిపారు. ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, మార్కెట్ తరలింపు.. ఇతర ప్రజా సమస్యలపై పోరాడిన చరిత్ర సీపీఐ(ఎం) అభ్యర్థికి మాత్రమే ఉందని గుర్తు చేశారు. పార్టీలు మారే వాళ్లకు ఓట్లు వెయ్యాలా.. మారని వాళ్లకు వేయాలా ఆలోచించాలని అభ్యర్థి యర్రా శ్రీకాంత్ కోరారు.
రోడ్ షోలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు వై. విక్రమ్, కార్పొరేటర్లు యల్లంపల్లి వెంకట్రావు, యర్రా గోపీ, జిల్లా నాయకులు యర్రా శ్రీనివాస్, ఎస్. నవీన్ రెడ్డి, తుమ్మా విష్ణు, పి.రమ్య, భూక్యా శ్రీనివాస్, బండారు యాకయ్య, రమేష్, వజినేపల్లి శ్రీనివాస్, యర్రా రమేష్ తదితరులు పాల్గొన్నారు.