భూ ఆరోగ్యంతోనే ఉత్పత్తి పెంపు : సీనియర్ రీసర్చ్ శ్రీనివాస్

నవతెలంగాణ – బొమ్మలరామారం
భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే పంట దిగుబడి  పెంచుకోవడంతో పాటు సుస్థిర వ్యవసాయానికి వీలు కలుగుతుందని ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ రీసర్చ్ ఫెల్లో కత్తెరసాల శ్రీనివాస్ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం జలాల్ పూర్  గ్రామంలోని  వ్యవసాయ కమతాల్లో రైతుల సమక్షంలో  కత్తెరసాల  శ్రీనివాస్  సోమవారం భూ ఆరోగ్య (భూసార ) పరీక్షలను నిర్వహించారు.పంట భూముల్లో ఆమ్ల, క్షార గుణాలు  ఎలా ఉన్నాయి అనే అంశంపై  ఆయన శాస్త్రీయ ఉపకరణాల ద్వారా  భూమి ఆరోగ్య పరీక్ష లను నిర్వహించారు.పాడి పశువులు,  ఇతర  వనరుల ద్వారా  లభించే సాంప్రదాయ ఎరువులను పంట భూముల్లో ఉపయోగించాలని, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయాలని ఆయన రైతులకు సూచించారు.పంట  కోత  తర్వాత వ్యర్థాలను భూమిలో తగలబెట్టడం వల్ల భూమి సారం కోల్పోయే అవకాశం ఉందని అందువల్ల పంట వ్యర్ధాలను భూమి లోపలనే ఉంచడం లేదా ఒక పక్కన తగులబెట్టడం చేయాలని కోరారు. పంట భూమిని  నాగలితో గాని, ట్రాక్టర్ తో గాని ఐదు ఇంచులకు మించి దున్నకూడదని ఆయన రైతులకు సూచించారు.పంట భూముల ఆరోగ్యం క్షీణించడంపై  కత్తెరసాల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు.  నేటి తరానికే కాకుండా భవిష్యత్ తరాలకు పంట భూములను అందించాలంటే  భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని  సూచించారు. జలాల్ పూర్ గ్రామ  పెద్దలు, సీనియర్ రైతు గుమ్మడి ప్రవీణ్ రెడ్డి  వివిధ రకాల  వ్యవసాయ కమతాల వద్దకు  భూ ఆరోగ్య పరీక్షల నిమిత్తం  కత్తెరసాల శ్రీనివాసును  తీసుకుని వెళ్లారు.   ఈ కార్యక్రమంలో జలాల్ పూర్ రైతులు గుమ్మడి సత్తిరెడ్డి,గుమ్మడి మల్లారెడ్డి, కౌకుట్ల అంజిరెడ్డి, అనగాని కృష్ణ,  గుమ్మడి ప్రవీణ్ రెడ్డి, జాగిల్లాపురం బిక్షపతి, సంజీవరెడ్డి, జి .అంజిరెడ్డి నరసింహ రెడ్డి, డి. యాదగిరి, అబ్దుల్ సలీం, మల్లేష్ లతోపాటు ఓయూ మరో సీనియర్ రీసెర్చ్ ఫెలో కుమ్మరి నిత్యానందం తదితరులు పాల్గొన్నారు.