సీనియార్టీ, సమర్థతకే పెద్దపీట

– టీఎస్‌పీయస్సీ నియామకాల్లో పారదర్శకతను పాటించిన సర్కారు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అత్యంత కీలకమైన టీఎస్‌పీయస్సీ ఛైర్మెన్‌, కమిషన్‌ సభ్యుల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం సీనియార్టీకీ, సామాజిక సమతుల్యతకు, సమర్థతకే పెద్ద పీట వేసింది. ఈ విషయంలో ఆచీతూచీ వ్యవహరించింది. ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచే టీఎస్‌పీయస్సీ ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఆ మేరకు సెర్చ్‌ కమిటీకి పూర్తి అధికారాలను అప్పగించిన సర్కార్‌ సమర్థులకు అవకాశం కల్పించింది. ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఉన్న అడ్డంకులన్నింటిని ఒక్కటొక్కటిగా అధిగమించేందుకు సీఎం రేవంత్‌ చర్యలు చేపట్టారు. యూపీఎస్సీ తరహాలో పరీక్షల నిర్వహణను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆయన కోరారు. ఇందులో భాగంగానే ఢిల్లీకి వెళ్లి యూపీఎస్సీ చైర్మెన్‌ను కలిసి చర్చలు జరిపారు.
ఈ క్రమంలోనే సుదీర్ఘ అనుభవం కలిగిన సివిల్‌ సర్వెంట్స్‌, విద్యావేత్తలకు ప్రభుత్వం ఈ సారి బోర్డులో అవకాశం కల్పించింది. టీఎస్‌ పీయస్సీ బోర్డు చైర్మెన్‌గా రిటైర్డ్‌ డీజీపీ మహేందర్‌రెడ్డిని నియమించింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అనితా రాజేంద్ర, ఇండియన్‌ పోస్టల్‌ సర్వీసెస్‌ రిటైర్డ్‌ అధికారి అమీర్‌ ఉల్లా ఖాన్‌, సీనియర్‌ ప్రొఫెసర్‌, డాక్టర్‌ నర్రి యాదయ్య, విద్యుత్‌ శాఖ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ వై.రామ్‌ మోహన్‌రావు, రిటైర్డ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ పాల్వాయి రజిని సభ్యులుగా నియమితులయ్యారు.
పేపర్ల లీకేజీలు, వరుస తప్పిదాలతో పక్కదారి పట్టిన టీఎస్‌ పీయస్సీని గాడిన పెట్టే సత్తా మాజీ పోలీస్‌ అధికారి మహేందర్‌రెడ్డికి ఉందని భావించిన సర్కారు ఆయన్ను చైర్మెన్‌గా నియమించింది. అంతకు ముందు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళికి ఈ బాధ్యత అప్పగించాలనుకున్నారు. వయో పరిమితి అనుకూలించకపోవటంతో ఆయన నిరాకరించారు. ఇదే వరుసలో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేరు పరిశీలనకు వచ్చింది. ఇప్పటికే బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉండటం, పొలిటికల్‌ ఫోరమ్‌లోనే ఉండేందుకు ఆయన నిశ్చయించుకోవటంతో మూడో పేరుగా రిటైర్డ్‌ డీజీపీ మహేందర్‌ రెడ్డికి ప్రభుత్వం ఈ బాధ్యతలు అప్పగించింది.
రిటైర్డ్‌ ఐఏఎస్‌ అనితా రాజేంద్రన్‌ గౌడ కులానికి చెందిన వ్యక్తి. ఐఏఎస్‌ అధికారిగా సుమారు పది శాఖల్లో పనిచేసిన అనుభవం ఆమెకు ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. నర్రి యాదయ్య, జేఎన్‌టీయూ ట్రిపుల్‌ ఈ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈయన కుర్మ కులానికి చెందిన వారు. రామ్‌మోహన్‌రావు జెన్‌కోలో ఈడీగా పనిచేస్తున్నారు. ఆయన బీఈ (సివిల్‌), ఎంబీఏ చదివారు. 1986 నుంచి విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్నారు. ఎస్టీ (ఎరుకుల) వర్గానికి చెందిన వారు. పాల్వాయి రజనీ గ్రూప్‌ వన్‌ ఆఫీసర్‌గా పనిచేసి వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. అంతకు ముందు టీచర్‌గా ఆమె పనిచేశారు. రూరల్‌ డెవలప్‌మెంట్‌లో, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేసిన అనుభవం ఆమెకు ఉన్నది. ఎస్సీ (మాదిగ) వర్గానికి చెందిన వారు. ఇలాంటి సామాజిక పొందికలు, వివిధ రంగాల్లో అనుభవాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఆయా అర్హతలున్న వారినే టీఎస్‌ పీయస్సీ చైర్మెన్‌ను, సభ్యులుగా నియమించిందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.