సెంథిల్‌బాలాజీని మంత్రిగా కొనసాగిస్తాం

తమిళనాడు ప్రభుత్వం స్పష్టీకరణ
చెన్నై : గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తొలగించిన సెంథిల్‌ బాలాజీని మంత్రిగా కొనసాగిస్తామని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎలాంటి ఫోర్టుపోలియో లేకుండా సెంథిల్‌ బాలాజీ మంత్రివర్గంలో ఉంటారని తెలిపింది. సెంథిల్‌బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గవర్నర్‌ ఆర్‌ ఎన్‌ రవి ఇచ్చిన ఉత్తర్వులను ‘పట్టించుకోనక్కర్లేదు’ అని తమిళనాడు ప్రభుత్వం భావిస్తున్నదని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగమ్‌ తెన్నరసు శుక్రవారం వెల్లడించారు. తమిళనాడు మంత్రి మండలి నుంచి సెంథిల్‌ బాలాజీని తక్షణమే తొలగిస్తూ గవర్నర్‌ ఆర్‌ ఎన్‌ రవి నిర్ణయం తీసుకున్నారని గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌ ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గవర్నర్‌ కొన్ని గంటల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్న ప్రకటించారు. అయినా సెంథిల్‌ బాలాజీని మంత్రిగా తొలగిస్తూ గవర్నర్‌ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై చెన్నైలోని సెక్రటేరియట్‌లో ఆర్థిక మంత్రి తంగమ్‌ తెన్నరసు శుక్రవారం విలేకరులకు తెలిపారు.. గవర్నర్‌ చర్య చట్ట ప్రకారం సమర్థనీయం కాదని అన్నారు. మంత్రి మండలి నుంచి మంత్రులను తొలగించడం లేదా నియమించడం ముఖ్యమంత్రికి ఉన్న ప్రత్యేక అధికారమని చెప్పారు. సెంథిల్‌బాలాజీ మంత్రివర్గంలో కొనసాగడం వలన ఈడీ, రాష్ట్ర పోలీసుల విచారణపై ప్రభావం చూపుతుందన్న గవర్నర్‌ వాదనను తంగమ్‌ తెన్నరసు కొట్టిపారేశారు. సెంథిల్‌ బాలాజీ ఇప్పటికే జ్యూడిషియల్‌ కస్టడీలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. పోర్ట్‌ఫోలియో లేని మంత్రిపై చర్య తీసుకోవడం వెనుక ‘ రాజకీయ ఉద్దేశాలు’ ఉన్నాయని తెన్నరసు అన్నారు. . ప్రస్తుతం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంలోని మంత్రులపై ‘కనీసం 11 కేసులు’ పెండింగ్‌లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. అయినా వారంతా మోడీ క్యాబినెట్‌లో కొనసాగుతున్నారని ప్రస్తావించారు. అలాగే ముఖ్యమంత్రి తనకు రాసిన లేఖలో ‘అసహజమైన భాష’ను ఉపయోగించారని గవర్నర్‌ చేస్తున్న ఆరోపణలను తెన్నరసు ఖండించారు. స్టాలిన్‌ చాలా మర్యాదగా ఉండే మనిషని, ఎల్లప్పుడూ గవర్నర్‌ పదవికి గౌరవం ఇస్తారని చెప్పారు. అలాగే సెంథిల్‌పై న్యాయవిచారణకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని తెన్నరసు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తెన్నరసుతో పాటు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎస్‌ రేగుపతి, డిఎంకె ఎంపి (రాజ్యసభ) పి. విల్సన్‌ కూడా పాల్గొన్నారు.