నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్:
ఎన్నికలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి మాత్రం చేయలేదని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శనివారం హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి మించిన మరొక రాజకీయ పార్టీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఇందుకు నిదర్శనం అన్నారు. హుస్నాబాద్ పై కెసిఆర్ సెంటిమెంట్ ఉన్నంత డెవలప్ మెంట్ ఏదని ప్రశ్నించారు. టీ. ఎస్.పి.ఎస్.సి అవినీతికి నిలయంగా మారిందన్నారు. హుస్నాబాద్ నుండి వరంగల్ వైపు హుజురాబాద్ నుండి కరీంనగర్ వైపు ఎక్కడా వెతికినా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కనబడటం లేదన్నారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యే లు కెసిఆర్ అపాయింట్మెంట్ కోరుతుండగా హుస్నాబాద్ లో మాత్రం ముఖ్యమంత్రే స్థానిక శాసనసభ్యుని ఇంటికి వస్తారని, అయిన హుస్నాబాద్ అభివృద్ధి ఎందుకు జరగలేదో చెప్పాలన్నారు. హుస్నాబాద్ లో మెడికల్ కాలేజీ ఎందుకు ఏర్పాటు చేయలేదని, ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా ఏం చేశారని ప్రశ్నించారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి గురించి స్థానిక శాసన సభ్యుడు ఎందుకు గళం విప్పడం లేదన్నారు. కాంగ్రెస్ ఆరు క్లారిటీలు ప్రామిసరీ నోట్ల లాంటివి, ఆర్ గ్యారంటీలపై ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలను ఆశ్రయిస్తే నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి ఇస్తారన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన కాలువ తప్ప గడిచిన 10 సంవత్సరాలలో ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి పురోగతి కనిపిస్తాలేదన్నారు. టీఎస్పీఎస్సీ లో అవకతవకలతో మనోవేదనకు గురైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ప్రవళిక ది ఆత్మహత్య కాదని బీఆర్ఎస్ ప్రభుత్వ హత్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయకుంటే నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అమ్ముకుంటున్న సంస్థలు ఎక్కడివని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇంటింటికి బంగారం పంచినా బీఆర్ఎస్ ను ప్రజలు విశ్వసించలేరన్నారు. బీఆర్ఎస్ అబద్దాల ప్రభుత్వమని ప్రజలకు తెలిసిపోయిందని, ప్రజలు ఇచ్చే తీర్పుతో బీఆర్ఎస్ నేతల దిమ్మతిరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కెడం లింగమూర్తి , బొలిశెట్టి శివయ్య, మండల అధ్యక్షుడు బంక చందు, జంగపల్లి ఐలయ్య, వేన్న రాజు చిత్తరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.