బెల్గ్రేడ్ : సెర్బియా ప్రధాని మిలోస్ వుసెవిక్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. నవంబరులో నిర్మాణంలో వున్న కాంక్రీట్ స్లాబ్ కూలిపోయి 15మంది మరణించిన ఘటనపై వారాల తరబడి కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో ఈ రాజీనామా వెలువడింది. నొవి శాడ్ నగరంలో చోటు చేసుకున్న ఈ సంఘటనతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. పెద్ద ఎత్తున అవినీతి వ్యతిరేక నిరసనలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిక్ నియంత పాలన పట్ల ప్రజల్లో అసమ్మతి, అసంతృప్తిలు మరింత పెరిగాయి. సెర్బియాలో ప్రజాస్వామిక స్వేచ్ఛను అణగదొక్కుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. సెర్బియాలో ఉద్రిక్తతలు తగ్గించడమే తన రాజీనామా ఉద్దేశమని వుసెవిక్ పత్రికా సమావేశంలో ప్రకటించారు. ఉద్రిక్తతలు, ఆగ్రహావేశాలను తగ్గించుకుని, తిరిగి చర్చలకు రావాలన్నదే తన విజ్ఞప్తి అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ప్రధాని రాజీనామాతో పార్లమెంటరీ ఎన్నికలు త్వరగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెర్బియా పార్లమెంట్ ఈ రాజీనామాను ఆమోదించాల్సి వుంది. 30రోజుల్లోగా కొత్త ప్రభుత్వాన్ని ఎంపిక చేయాల్సి వుంది లేదా మధ్యంతర ఎన్నిలకు పిలుపివ్వాల్సి వుంటుంది. రాజధాని బెల్గ్రేడ్‌లో సోమవారం వేలాదిమంది యూనివర్శిటీ విద్యార్ధులు 24గంటల పాటు రహదారుల దిగ్బంధనం నిర్వహించారు. స్లాబ్ కూలిన ఘటనకు జవాబుదారీ వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంలో విశృంఖలంగా అవినీతి పెచ్చరిల్లడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని విమర్శకులు పేర్కొంటున్నారు. నవంబరులో స్లాబ్ కూలిపోయిన ఘటన జరిగినప్పటి నుండి అదే సమయానికి ప్రతి రోజూ 15నిముషాల పాటు విద్యార్ధులు దేశవ్యాప్తంగా దిగ్బంధన పాటిస్తున్నారు.