– మండిపడ్డ ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్ : ప్రజాప్రతినిధుల చర్చలు, చట్టాల రూపకల్పన జరిగే పవిత్రమైన అసెంబ్లీని సీరియల్ షూటింగ్‌కు అనుమతి ఇచ్చి అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చే విధంగా జమ్ముకాశ్మీర్‌లోని బీజేపీ అడ్మినిస్ట్రేటివ్ ప్రవర్తించింది. జమ్ముకాశ్మీర్ అసెంబ్లీలో షూటింగ్ జరుగుతున్న ఫొటోలు, ట్రెజరీ, ప్రతిపక్ష సభ్యుల స్థానాల్లో ఉన్న నటీనటులు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో ఒక సీరియల్ షూటింగ్‌కు బీజేపీ అనుమతించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జమ్ముకాశ్మీర్‌లో 2018 నుంచి అసెంబ్లీ ఎన్నికల జరగడం లేదు. ప్రస్తుతం జమ్ముకాశ్మీర్ కేంద్రంలో బీజేపీ నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలనలో ఉంది. అసెంబ్లీలో సీరియల్ షూటింగ్‌కు అధికారులు అనుమతించారు. అసెంబ్లీ లోపల షూటింగ్‌కు అనుమతి ఇవ్వడంపై జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) ఉపాధ్యక్షులు ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు. ‘ఇక్కడ (అసెంబ్లీ) ఒకప్పుడు అన్ని పార్టీలు, మతాలు, నేపధ్యాలు, జమ్ముకాశ్మీర్‌లో వివిధ ప్రాంతాల నుంచి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అధిక ప్రాముఖ్యత కలిగిన అంశాలపై చర్చలు జరిపారు. చట్టాలను రూపొందించారు. ప్రస్తుతం దీనిని టీవీ డ్రామాలకు సెట్‌గా నటీనటులు, జూనియర్లు ఉపయోగిస్తున్నారు’ అని అబ్దుల్లా పేర్కొన్నారు. అసెంబ్లీలో షూటింగ్ జరపటం ‘అవమానకరం’ అని ఆయన విమర్శించారు. ‘జమ్ముకాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని నడిపిన బీజేపీ ప్రజాస్వామ్యం చిహ్నాన్ని ఈ విచారకరమైన స్థితికి దిగజార్చడం ఎంత అవమానకరం’ అని వ్యాఖ్యానించారు.