సిరీస్‌ సమం!

The series is even! – రెండో వన్డేలో విండీస్‌ గెలుపు
– నిరాశపరిచిన హార్దిక్‌ సేన
– ఆగస్టు 1న సిరీస్‌ డిసైడర్‌
కుర్రాళ్లకు కరీబియన్లు షాక్‌ ఇచ్చారు. స్వల్ప ఛేదనలో షారు హౌప్‌ (63) అజేయ అర్థ సెంచరీతో మెరువగా.. 6 వికెట్ల తేడాతో భారత్‌పై వెస్టిండీస్‌ గెలుపొందింది. 2019 డిసెంబర్‌ తర్వాత టీమ్‌ ఇండియాపై వన్డేల్లో కరీబియన్లు సాధించిన తొలి వన్డే విజయం ఇదే కావటం గమనార్హం. తొలుత భారత్‌ 181 పరుగులకు కుప్పకూలగా.. వెస్టిండీస్‌ 36.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్‌ 1-1తో సమం కాగా.. నిర్ణయాత్మక వన్డే ఆగస్టు 1న జరుగనుంది.
నవతెలంగాణ-బ్రిడ్జ్‌టౌన్‌
వెస్టిండీస్‌ ఎదురు నిలిచింది. రెండో వన్డేలో భారత్‌ను గట్టి దెబ్బ కొట్టింది. కెన్సింగ్టన్‌ ఓవల్‌లో ఖతర్నాక్‌ ప్రదర్శన చేసిన కరీబియన్లు 2019 (డిసెంబర్‌) తర్వాత భారత్‌పై వన్డేల్లో తొలి విజయం సాధించింది. కెప్టెన్‌ షారు హౌప్‌ (63 నాటౌట్‌, 80 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌కు తోడు కీసీ కార్టీ (48 నాటౌట్‌, 65 బంతుల్లో 4 ఫోర్లు) రాణించాడు. 182 పరుగుల లక్ష్యాన్ని 36.4 ఓవర్లలోనే ఛేదించిన వెస్టిండీస్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 40.5 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (55, 55 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీతో మెరిసినా.. ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. శుభ్‌మన్‌ గిల్‌ (34) ఫర్వాలేదనిపించగా.. సంజు (9), అక్షర్‌ (1), హార్దిక్‌ (7), జడేజా (10), సూర్య (24) నిరాశపరిచారు. విండీస్‌ కెప్టెన్‌ హౌప్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.
కరీబియన్లు కొట్టేశారు
182 పరుగుల స్వల్ప ఛేదనలో ఆతిథ్య విండీస్‌కు మంచి ఆరంభం దక్కింది. బ్రాండన్‌ కింగ్‌ (15), కైల్‌ మేయర్స్‌ (36, 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించారు. అలిక్‌ అతానేజ్‌ (6), షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (9) నిరాశపరిచినా.. కెప్టెన్‌ షారు హౌప్‌ (63 నాటౌట్‌), కీసీ కార్టీ (48 నాటౌట్‌) ఐదో వికెట్‌కు అజేయంగా 91 పరుగులు జోడించారు. తొలి వన్డేలో ఇదే పిచ్‌పై స్పిన్‌ మాయజాలం నడువగా.. రెండో వన్డేలో మాత్రం పేస్‌కు అనుకూలించింది. శార్దుల్‌ ఠాకూర్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లతో భారత శిబిరంలో ఆశలు రేపాడు. కానీ హౌప్‌, కార్టీ జోడీ కరీబియన్లకు మెరుపు విజయాన్ని అందించారు. శార్దుల్‌ మూడు వికెట్లు తీసుకోగా.. కుల్దీప్‌ యాదవ్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.
కిషన్‌ మెరిసినా
తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా ఓపెనర్ల దూకుడుతో భారీ స్కోరు దిశగా సాగింది. ఇషాన్‌ కిషన్‌ (55), శుభ్‌మన్‌ గిల్‌ (34) తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించారు. కానీ ఆ తర్వాత భారత మిడిల్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. సంజు శాంసన్‌ (9), అక్షర్‌ పటేల్‌ (1), హార్దిక్‌ పాండ్య (7), రవీంద్ర జడేజా (10), శార్దుల్‌ ఠాకూర్‌ (16), సూర్య కుమార్‌ యాదవ్‌ (24) అంచనాలను అందుకోలేదు. విండీస్‌ స్పిన్నర్లు మోటీ (3/36), యానిక్‌ (1/5) మాయ చేయగా.. రోమారియో షెఫార్డ్‌ (3/37), అల్జారీ జొసెఫ్‌ (2/35)లు రాణించారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలు రెండో వన్డే మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే.
స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌ : కిషన్‌ (సి) అతానేజ్‌ (బి) షెఫార్డ్‌ 55, గిల్‌ (సి) జొసెఫ్‌ (బి) మోటీ 34, సంజు (సి) కింగ్‌ (బి) యానిక్‌ 9, అక్షర్‌ (సి) హౌప్‌ (బి) షెఫార్డ్‌ 1, హార్దిక్‌ (సి) కింగ్‌ (బి) సీల్స్‌ 7, సూర్య (సి) అతానేజ్‌ (బి) మోటీ 24, జడేజా (సి) యానిక్‌ (బి) షెఫార్డ్‌ 10, శార్దుల్‌ (ఎల్బీ) జొసెఫ్‌ 16, కుల్దీప్‌ నాటౌట్‌ 8, ఉమ్రాన్‌ (సి) కార్టీ (బి) జొసెఫ్‌ 0, ముకేశ్‌ (సి) హెట్‌మయర్‌ (బి) మోటీ 6, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (40.5 ఓవర్లలో ఆలౌట్‌) 181.
వికెట్ల పతనం : 1-90, 2-95, 3-97, 4-113, 5-113, 6-146, 7-148, 8-167, 9-167, 10-181.
బౌలింగ్‌ : కైల్‌ మేయర్స్‌ 5-0-18-0, జేడెన్‌ సీల్స్‌ 6-0-28-1, అల్జారీ జొసెఫ్‌ 7-0-35-2, జి మోటీ 9.5-0-36-3, రొమిరియో షెఫార్డ్‌ 8-1-37-3, యానిక్‌ 5-0-25-1.
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ : కింగ్‌ (ఎల్బీ) శార్దుల్‌ 15, మేయర్స్‌ (సి) ఉమ్రాన్‌ (బి) శార్దుల్‌ 36, అతానేజ్‌ (సి) కిషన్‌ (బి) శార్దుల్‌ 6, హౌప్‌ నాటౌట్‌ 63, హెట్‌మయర్‌ (బి) కుల్దీప్‌ 9, కార్టీ నాటౌట్‌ 48, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం : (36.4 ఓవర్లలో 4 వికెట్లకు) 182.
వికెట్ల పతనం : 1-53, 2-54, 3-72, 4-91.
బౌలింగ్‌ : హార్దిక్‌ పాండ్య 6.4-0-38-0, ముకేశ్‌ కుమార్‌ 3-0-17-0, ఉమ్రాన్‌ మాలిక్‌ 3-0-27-0, శార్దుల్‌ ఠాకూర్‌ 8-0-42-3, కుల్దీప్‌ యాదవ్‌ 8-0-30-1, రవీంద్ర జడేజా 6-0-24-0, అక్షర్‌ పటేల్‌ 2-1-4-0.