– మూడో టీ20లో భారత్ గెలుపు
– సూర్య కుమార్ సెంచరీ
– కుల్దీప్ ఐదు వికెట్ల మాయ
జొహనెస్‌బర్గ్: టీ20 సిరీస్ సమం. వరుణుడి ఆటతో రెండు మ్యాచుల సిరీస్‌గా మారిన పోరులో దక్షిణాఫ్రికా, భారత్ ట్రోఫీని పంచుకున్నాయి. కీలక మూడో టీ20లో భారత్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీ20 సిరీస్ 1-1తో సమమైంది. 202 పరుగుల భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా 95 పరుగులకే కుప్పకూలింది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (5/17) ఐదు వికెట్ల మాయజాలంతో చెలరేగటంతో సఫారీలు 13.5 ఓవర్లలోనే చేతులెత్తేశారు. రవీంద్ర జడేజా (2/25) సైతం రాణించాడు. సఫారీ బ్యాటర్లలో డెవిడ్ మిల్లర్ (35, 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్క్‌రామ్ (25, 14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (100, 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీకి తోడు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (60, 41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగటంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగుల భారీ స్కోరు చేసింది. టీ20 సిరీస్ ట్రోఫీని ఇరు జట్లు పంచుకోగా.. సూర్య కుమార్ యాదవ్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
చెలరేగిన సూర్య, యశస్వి: టాస్ ఓడిన టీమ్ ఇండియా.. తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. ఓ ఎండ్‌లో యశస్వి జైస్వాల్ (60) దంచికొట్టినా.. స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (8) నిరాశపరిచాడు. రెండు బౌండరీలతో పరుగుల ఖాతా తెరిచిన శుభ్‌మన్.. మహరాజ్ మాయలో పడ్డాడు. హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ (0) ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్‌గా నిష్క్రమించాడు. ఈ దశలో యశస్వితో జతకట్టిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. యశస్వి, సూర్య జోడీ మూడో వికెట్‌కు 70 బంతుల్లోనే 112 పరుగులు జోడించింది. దీంతో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. యశస్వి జైస్వాల్ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 34 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా.. సూర్యకుమార్ యాదవ్ రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 32 బంతుల్లోనే ఫిఫ్టీ అందుకున్నాడు. జైస్వాల్ నిష్క్రమించినా.. రింకూ సింగ్ (14) జతగా సూర్య ప్రతాపం కొనసాగింది. ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 55 బంతుల్లోనే సెంచరీ బాదిన సూర్యకుమార్ యాదవ్.. చివరి ఓవర్లో వికెట్ కోల్పోయాడు. ఆఖర్లో జితేశ్ శర్మ (4), రవీంద్ర జడేజా (4) సైతం నిరాశపరిచారు. ఇక భారత్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో అరంగ్రేట బౌలర్ బర్గర్ ఏడు బంతుల ఓవర్ వేయటం గమనార్హం.