
– రానున్న మూడు రోజుల్లో కార్యక్రమాన్ని పూర్తి చేయాలి
– పరీక్షా కేంద్రాలలో పొరపాటు జరిగితే సూపరింటెండెంట్ లదే బాధ్యత
– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ప్రభుత్వం ప్రకటించిన మరో రెండు గ్యారెంటీలకు సంబంధించి ప్రజా పాలన దరఖాస్తులలో వివరాలను సరి చేసేందుకు అన్ని ఎంపీడీవో కార్యాలయాలు, మునిసిపల్ వార్డులలో సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి ఆదేశించారు. శుక్రవారం ఆమె హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో ఇంటర్మీడియట్, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు, ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా పాలన సందర్భంగా లబ్ధిదారుల నుండి స్వీకరించిన దరఖాస్తులలో ఏదైనా కారణం చేత వివరాలు ఇవ్వని, ప్రత్యేకించి గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాల కు సంబంధించి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ నంబరు, విద్యుత్ వినియోగదారు నంబరు ఇవ్వనట్లయితే ఇప్పుడు ఏర్పాటు చేసే సేవ కేంద్రాల ద్వారా సమాచారాన్ని సరిచేయాలని తెలిపారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు ఇప్పుడు ఇవ్వవచ్చని చెప్పారు. ఇందుకుగాను అన్ని ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపల్ వార్డులలో సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, సదరు సేవా కేంద్రాలలో ఒక డిటిపి ఆపరేటర్, ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి దరఖాస్తులలో తప్పులను సరిచేయాలని సూచించారు. రానున్న మూడు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ఏలాంటి లీకేజీ, మాల్ ప్రాక్టీస్ లేకుండా చూసుకోవాలని అన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితులలో మొబైల్ ఫోన్ ను అనుమతించవద్దని, మొబైల్ ఫోన్లు పరీక్ష కేంద్రానికి బయట ఉంచాలని ,ఒకవేళ ఎక్కడైనా పరీక్ష కేంద్రాల్లో పొరపాట్లు జరిగినట్లయితే సంబంధిత పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటిండెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. పరీక్షల సందర్బంగా ఏలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా పరీక్షలకు సంబంధించి వచ్చే అపోహలు,అవాస్తవల పై తక్షణమే స్పందించేందుకు జిల్లా స్థాయిలో క్విక్ రెస్పాన్స్ టీమ్ లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు వీటి పై స్పందించి సరైన సమాచారం అందించాలని, ఇందుకుగాను సరైన నియంత్రణ చర్యలను చేపట్టాలని అన్నారు. పరీక్షలపై జిల్లా కలెక్టర్లు ప్రతిరోజు సమీక్షించాలని చెప్పారు. రాష్ట్ర డి జి పి రవి గుప్తా మాట్లాడుతూ అన్ని పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, మొబైల్ ఫోన్ల విషయంలో పోలీసు అధికారులు ఖచ్చితంగా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ లను సెంటర్లలోకి అనుమతించవద్దని, అదేవిధంగా సమస్యత్మక పరీక్ష కేంద్రాల విషయంలో మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం మాట్లాడారు. కాగా ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో జిల్లా నుండి జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన, జిల్లా ఎస్పీ చందన దీప్తి, జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డిపిఓ మురళి, డీఈఓ బిక్షపతి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దసృ నాయక్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.