నాజర్‌ ఆస్పత్రిలో స్థంభించిన సేవలు

Services stopped at Nasser Hospitalజెరూసలేం : గాజా స్ట్రిప్‌లో రెండో అతిపెద్ద ఆస్పత్రిగా పేరు గాంచిన నాజర్‌ ఆస్పత్రి లో సేవలు పూర్తిగా స్థంభించాయని అధికారులు వెల్లడించారు. గాజాలోని ఖాన్‌ యూనిస్‌ పట్టణంలో ఉన్న ఈ ఆస్పత్రి నెల రోజుల నుంచి ఇజ్రాయిల్‌ సైన్యం ఆధీనంలోనే ఉంది. ఈ ఆస్పత్రి లో సుమారు 200 రోగుల ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించింది. ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో ఈ ఆస్పత్రిని ఇజ్రాయిల్‌ సైన్యం స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి కూడా ఇక్కడ వైద్య సేవలు క్షీణిస్తూ వచ్చాయి. తాజాగా ఆస్పత్రి లో సేవలు పూర్తిగా స్థంభించిపోయినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కాల్పుల విరమణలో పురోగతి లేదు : ఖతార్‌ ప్రధాని
గాజాలో కాల్పుల విరమణ అమలు దిశగా ఏ విధమైన పురోగతి లేదని కతార్‌ ప్రధానమంత్రి షేక్‌ మహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ బిన్‌ జాసిమ్‌ అల్‌ థానీ తెలిపారు. విదేశాంగ మంత్రి కూడా అయిన అల్‌ థాని శనివారం విలేకరులతో మాట్లాడుతూ గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి రావాలని ఖతార్‌ కోరుకుంటుందని చెప్పారు. కాల్పుల విరమణ అమలులోకి వస్తే గాజాకు చెందిన ప్రజలు తిరిగి తమ ఇండ్లకు వెళ్లడానికి అవకాశం కలుగుతుందని అన్నారు.
రఫా వద్ద బఫర్‌ జోన్‌ నిర్మిస్తున్న ఈజిప్టు
గాజా సరిహద్దుల్లో ఉన్న రఫా పట్టణానికి సమీపంలో భారీ సిమెంట్‌ కంచెను నిర్మిస్తున్నట్లు ఈజిప్టు వెల్లడించింది. ఇది గాజాకు మరింత సహాయాన్ని అందించడానికి ఏర్పాటు చేస్తున్న ‘బఫర్‌ జోన్‌’గా పేర్కొంది. ఇక్కడ ట్రక్కుల కోసం పార్కింగ్‌ ప్రాంతాలు, గిడ్డంగులు, అడ్మినిస్ట్రేటివ్‌ కార్యాలయాలు, డ్రైవర్లకు వసతి కోసం గృహాలు నిర్మిస్తున్నట్లు తెలిపింది. ఇజ్రాయిల్‌ దాడుల భయంతో వలస వచ్చే పాలస్తీనీయుల కోసం వసతి గృహాలను నిర్మిస్తున్నామని, గాజా సరిహద్దు వెంబడి కంచె నిర్మిస్తున్నామని వస్తున్న వార్తలు పూర్తిగా ఊహాజనితమని ఈజిప్టు మరోసారి స్పష్టం చేసింది. పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించడానికి జరుగుతున్న చర్యలను ఇజ్రాయిల్‌ వ్యతిరేకించింది. ఇలాంటి ‘ఏకపక్ష గుర్తింపు’ను ఖండిస్తున్నామంటూ ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశం ఒక ప్రకటన విడుదల చేసింది.