
నవతెలంగాణ – రాయపర్తి
గ్రామ ప్రథమ పౌరుని స్థానంలో ఉండి సొంత గ్రామానికి సేవ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న అని కొత్తూరు గ్రామ సర్పంచ్ కందికట్ల స్వామి అన్నారు. సర్పంచ్ పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తూరు గ్రామం పోరాటాల గడ్డ అని వివరించారు. ఐదు సంవత్సరాల పదవి కాలంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ గ్రామస్తుల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. కొత్తూరు గ్రామానికి జిల్లా స్థాయిలో పేరు వచ్చే విధంగా ప్రణాళికబద్ధంగా పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రజా నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు సంపూర్ణ సహకారంతో గ్రామం సస్యశ్యామలంగా తయారైందని చెప్పారు. కోట్ల రూపాయల నిధులతో గ్రామంలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, వీధి దీపాలు, హైమాస్ట లైట్లు, బిటి రోడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చరిత్రలో నిలిచే స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం వంటివి నిర్మించడం జరిగిందని అన్నారు. గ్రామ పాలనకు సహకరించిన ఎంపీటీసీ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు, పంచాయతీ సిబ్బందికి, ఆశా వర్కర్లకు, గ్రామస్థాయి ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.