రాష్ట్రంలో మెట్రో కోచ్‌ ఫ్యాక్టరీ పెట్టండి

రాష్ట్రంలో మెట్రో కోచ్‌ ఫ్యాక్టరీ పెట్టండి– అవసరమైన సహకారం అందిస్తాం : బీఈఎంఎల్‌ సీఎండీ శంతను రారుతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘రాష్ట్రంలో మెట్రో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ పెట్టండి.. అవసరమైన భూమి, ఇతర వనరులు, సహకారం ప్రభుత్వ పక్షాన అందిస్తాం’అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం సచివాలయంలో బీఈఎంఎల్‌ (భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌) కంపెనీ సీఎండీ శంతను రారు బృందంతో ఆయన సమావేశమయ్యారు. బీఈఎంఎల్‌ కంపెనీ బేస్‌ ఎక్కడ, ఏ యే రంగాల్లో పెట్టుబడులు, ఉత్పత్తులు సృష్టిస్తున్నదనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. మెట్రో రైల్‌ కోచ్‌లు, రక్షణ, మైన్స్‌ వంటి రంగాల్లో తమ కంపెనీ పని చేస్తుందని శంతను రారు ఈ సందర్భంగా వివరించారు. బెంగళూరు కేంద్రంగా తమ కంపెనీ పని చేస్తుందనీ, రక్షణ రంగానికి సంబంధించి కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్‌లో, సింగరేణిలో ఎర్త్‌ మూవర్స్‌ రంగాల్లో పనిచేస్తున్నట్టు వివరించారు. తమ కంపెనీ హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయం ఉన్నట్టు తెలిపారు. ఇక్కడ మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న క్రమంలో తాము రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని వివరించారు. మెట్రో కోచ్‌ ఫ్యాక్టరీల తయారీలో ఇతర కంపెనీలకు బీఈఎంఎల్‌కు ఉన్న తేడా ఏంటి? ధరలు, నాణ్యత వంటి అంశాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటో కంపెనీ లెటర్‌పై వివరించాలని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా కోరారు. హైదరాబాద్‌ సిటీతో పాటు రాష్ట్రంలోని వాతావరణం, వనరులను పరిశీలించండి, త్వరలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి మెట్రో రంగానికి సంబంధించి బీఈఎంఎల్‌ ఆసక్తులను సమగ్రంగా చర్చిద్దామని భట్టి తెలిపారు. సమావేశంలో డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఈఎంఎల్‌ కంపెనీ మెట్రో కోచ్‌ నమూనాను కంపెనీ బృందం డిప్యూటీ సీఎం కు అందజేసింది.