నవతెలంగాణ – డిచ్ పల్లి
నిరుద్యోగ యువతి, యువకులకు ఉపాధి కోసం శిక్షణలను ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో సెట్విన్ శిక్షణ సంస్థ కొనసాగుతుంది. జిల్లాలో ఉన్న ఎకైక శిక్షణ కేంద్రం డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ గ్రామ పంచాయతీ భవనంపై కొనసాగుతుంది. డిచ్పల్లిలో 2014లో సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంబించారు. ఇక్కడ పది, ఇంటర్ ఉత్తీర్ణులైన వారికి అతితక్కువ ఫీజుతో కంప్యూటర్ శిక్షణ ( ఎంఎస్-ఆఫీసు/ డీటీపీ/ ఫోటోషాప్/ పేజీమేకర్/ టాలీ కోర్సులు)తోపాటు, కుట్టు శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి కోర్సులను మార్కెట్లో ప్రైవేటు శిక్షణ కేంద్రాల వద్ద నేరుకోవాలంటే దాదాపు రూ. నాలుగు వేల పైన పీజు ఉంటుంది. ఈ కేంద్రంలో కేవలం రూ.750 (కంప్యూటర్ శిక్షణ), రూ.1000 (టైలరింగ్ ఫీజుతో నిరుద్యోగ యువతీయువకులకు శిక్షణను నేర్పిస్తున్నారు. మూడు నెలల అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ప్రభుత్వం ప్రత్యేకమైన సర్టిఫికెట్ను అందిస్తుంది. ఈ సర్టిఫికెట్ ఇటు ప్రైవేటు రంగంలోను, అటు ప్రభుత్వ రంగంలోని ఉపయోగపడుతుంది. ఈ శిక్షణ కేంద్రంలో ఇప్పటి వరకు రెండువేల వరకు యువత, మహిళలు వివిధ రకాల శిక్షణ పొందినట్లు సంస్థ నిర్వహాకులు తెలిపారు.
యువతి, మహిళల కోసం…
నిరుద్యోగ యువతులు, మహిళల కోసం ఇక్కడ కుట్టు శిక్షణ ఇస్తున్నారు. సర్టిఫికెట్ పొందిన వారు ఈ శిక్షణ పొందిన వారు సొంతంగా వ్యాపారాన్ని ప్రారంబించవచ్చును. బ్యాంక్ల నుంచి కుడా రుణ సదుపాయం కల్పిస్తారు. కుట్టు శిక్షణ కోసం వచ్చెవారు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రతిరోజు దరఖాస్తులను స్వీకరిస్తాం :
డిచ్పల్లిలోని సెట్విన్ శిక్షణ కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్న పంచాయతీ భవనంపైన ఉంటుంది. ప్రతిరోజు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు శిక్షణ సంస్థ జిల్లా సమన్వయకర్త అబ్రార్ఖాన్, శిక్షణ బృందం సందీప్(కంప్యూటర్), గౌతమి (కుట్టు శిక్షణ) తెలిపారు. ముఖ్యంగా యువతీయువకులు చదువుకుంటనే ప్రతిరోజు రెండుగంటలపాటు శిక్షణ పొందేవిధంగా వారికి అనుకులమైన సమయాల్లో శిక్షణ పొందవచ్చును.