బాలల్లో కథల ద్వారా వ్యక్తిత్వ వికాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తున్న రచయిత్రి డా|| అమరవాది నీరజ. వృత్తిరీత్యా అమెరికాలో కొంతకాలం ఉన్నారు. అమెరికాలో ఉన్నన్ని రోజులు కూడా అక్కడి బాలలకు తన కథల ద్వారా బాలల వికాసానికి కృషి చేశారు. గతంలో తేనె చినుకులు, చిరుకానుక బాలల కథల సంపుటాలు ప్రచురించారు. ఇక 2023 లో విడుదల చేసిన తాజా బాలల కథల సంపుటి ‘ఏడురంగుల జెండా’. ఈ కథల సంపుటిలో మొత్తం 22 కథలున్నాయి. కథలు వేటికవే భిన్నమైన కథాంశంతో ఉంటాయి.
మొదటి కథ ‘ఆటల్లో అరటిపండు’, చివరికథ ‘గొప్పనిజం’. మన గురించి ఇతరులు చెపితేనే గొప్ప. మన గురించి మనం చెప్పుకోవటం గొప్పకాదు’ అని తెలిపే కథ ‘గొప్పనిజం’.
పెద్దలను, పిల్లలను ఆలోచింపజేసే కథ చిన్ని సత్య. అందులో గుడ్‌టచ్, బాడ్‌టచ్ ల గురించి పిల్లలకు తెలియజేయాల్సిన ఆవశ్యకతను చెప్పినతీరు ప్రశంసనీయం. కల్లాకపటం లేకుండా, ఇచ్చిపుచ్చుకొనే స్వభావాలను స్నేహపు విలువలు, చలాకి చేతన్ కథలలో చెపుతారు.
ప్రతివారికి ఏదో ఒక రంగంలో ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని చిన్నతనంలోనే గుర్తించి ప్రోత్సహిస్తే, కుటుంబానికి, దేశానికి గర్వకారణం కాగలరని, ‘గెలుపు చప్పట్లు’ కథలో మనసుకు హత్తుకునేట్లు చెప్పారు. ఇక కథా సంపుటి శీర్షికతో ఉన్న కథ ‘ఏడురంగుల జెండా’. ఈ కథలో హరివిల్లులోని విజ్ఞాన విషయాలను చెబుతూ, దేశానికి మువ్వన్నెల జెండాలాగా కీర్తి తేవాలంటారు. ‘జామచెట్టు’ కథలో పర్యావరణ సంరక్షణలో మొక్కల ఆవశ్యకత ను కొత్తగా ఆవిష్కరించారు. ఈ కథను ఒక రకంగా సాంకేతికత పరిచయం, పర్యావరణ అవగాహన, భవిష్యత్తు బాధ్యత వంటివిగా చూడవచ్చు. కధలోకి వస్తే, భూగ్రహం నుండి తప్పిపోయి, అంగారక గ్రహానికి వెళ్ళిన బాలుని నేపధ్యంగా భవిష్యత్తు చిత్రాన్ని చక్కగా చూపిస్తారు.
‘కుందేలు పంజా’ కథలో ఒక కుందేలు తన పంజాతో సింహాన్ని కూల్చివేశానని చెబుతుంది. దానికి నిజంగానే భయపడ్డ సింహాలు సాక్ష్యం చూపించమని అడగగా, సింహాల్ని స్వయంగా నీళ్ళున్న బావి వద్దకు తీసుకెళ్ళి ‘ఇందులో నేను నా పంజా దెబ్బతో పడవేసిన సింహాలు ఉన్నాయి, చూడండి’ అని చెబుతుంది. తమ ప్రతిబింబాల్ని అందులో చూసుకున్న సింహాలు నిజంగానే భయపడతాయి.
‘గెలుపు చప్పట్లు’ కథలో పిల్లల ఇష్టాలకు తగినంత ప్రాముఖ్యత ఇవ్వాలని తండ్రి గ్రహించటం సమాజంలో రావలసిన మార్పు అనిపించింది.
డా|| అమరవాది నీరజ రచనా శైలి, శిల్పం పిల్లల్ని సొంతగా చదివించేలా ఉంటుంది. కథల్లో సరళమైన భాష ఆకట్టుకుంటుంది. ఆంగ్ల పదాల జోలికి పోరు. ఏడురంగుల జెండా కథల సంపుటికి ప్రముఖ చిత్రకారులు రాజు ఈపూరి అందమైన ముఖచిత్రంతో పాటు, లోపలి ప్రతి కథకూ ఆకట్టుకునే బొమ్మలు వేశారు. పిల్లలతో పాటు పెద్దలుకూడా చదవాల్సిన పుస్తకం.
– పైడిమర్రి రామకృష్ణ, 92475 64699