వర్షిత్, ప్రకృత్ ఇద్దరూ మంచి స్నేహితులు. వేసవి సెలవులు కావడంతో వారికి ఏమి చేయాలో తోచడం లేదు. ఇంట్లో టీవీ చూద్దామంటే నాన్న తిడతాడని భయం. బయటికి వెళ్లి ఆడుకుందామంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి అని అమ్మ బయటికి వెళ్ళనీయడం లేదు. సాయంత్రం ఆరు తర్వాతే ఆడుకునే సమయం. అది కూడా ఒక గంట మాత్రమే.
సాయంత్రం కాగానే వీధిలో ఉన్న అరుగు మీద కూర్చుని వర్షిత్, ప్రకృత్ ముచ్చట్లు పెడుతూ.. ఆటలు ఆడుతూ గడిపేవారు. ఒక్కొక్కసారి ఆటలు ఆడుతూ ఊరును దాటి అడవికి చేరేవారు. అక్కడ పక్షుల చప్పుళ్లతో.. చల్లని గాలికి ఎగిరి గంతులేస్తూ మైమరచి పోయేవారు.
”ఇక్కడ ఇంత చల్లగా ఉంది. మరి మన ఊర్లో ఎందుకు ఇలా లేదు” అని వర్షిత్ సందేహంగా ప్రకృత్‌ను అడిగాడు. ”ఓ.. అదా! మొన్న మన మాస్టారు చెప్పారు కదా? మన చుట్టూ చెట్లు ఉంటే చల్లని గాలి వస్తుంది. వర్షాలు కూడా పడతాయి” అని వర్షిత్ వైపు చూస్తూ అన్నాడు ప్రకృత్.
ఇద్దరూ చీకటి పడేలోపు ఇంటికి చేరుకున్నారు.
మరుసటి రోజు సాయంత్రం ఇద్దరూ అడవికి చేరుకున్నారు. అప్పుడే సన్నని వర్షపు జల్లు మొదలైంది. ఆకాశంలో ఇంద్రధనస్సును అందుకోవడానికి ఇద్దరూ ఎగురుతున్నారు. అనుకోకుండా ఒక్కసారిగా వర్షిత్‌కు రెక్కలొచ్చాయి. ఆనందంతో పైకి ఎగిరి మబ్బులను దాటుకుని ఇంద్రధనుస్సుపై వాలాడు. అక్కడ వనదేవత ప్రత్యక్షమైంది. ఆ దేవత వర్షపు జల్లులో తళతళా మెరిసిపోతుంది. ”వర్షిత్ ఇటు రా.. ఎలా ఉంది ఆకాశంలో” అని అడిగిందా వనదేవత.
”చాలా ఆనందంగా ఉంది. నమ్మలేకపోతున్నాను” అని తన రెక్కలను చూసుకుంటూ చెప్పాడు.
”ఇంద్రధనస్సును చూడడమే కానీ, ఇలా ఇంద్రధనస్సుపై నిలబడటం చాలా సంతోషంగా ఉంది. కానీ కింద నా మిత్రుడు కూడా ఉన్నాడు. వాడిని కూడా పైకి తీసుకురండి” అని వినయంగా వనదేవతను కోరాడు వర్షిత్. అలాగేనంటూ ప్రకృత్‌ని కూడా పైకి తీసుకొచ్చింది. ఇద్దరూ చాలాసేపు ఇంద్రధనస్సుపై ఎగిరి గంతులేస్తూ ఆటలాడారు.
”నాకు చిన్నప్పటినుండి ఏడు రంగులతో కురిసే వానను చూడాలని కోరిక” అని వనదేవతతో చెప్పాడు వర్షిత్. ”నీ కోరికను నేను తీరుస్తాను. కానీ నాది ఒక షరతు అన్నది వనదేవత. కాసేపు ఆలోచించి ”సరే చెప్పండి” అని తలుపాడు వర్షిత్.
మీరిద్దరూ ప్రతి పుట్టినరోజుకు కొన్ని మొక్కలు నాటాలి” అన్నది వనదేవత.
”ఓ ఇంతేనా? తప్పకుండా నాటుతాం” అని మాటిచ్చారు ఇద్దరూ.
చూస్తుండగానే ఆకాశమంత ఇంద్రధనస్సు పరుచుకుంది.
”వావ్ భలే.. భలే..” అంటూ చిందులేశారు. ”మమ్మల్ని కిందికి పంపండి. మేం ఏడు రంగుల వానను చూస్తాము” అని వనదేవతను కోరారు. వెంటనే ఇద్దరు కిందికి వచ్చారు. వర్షం ఏడు రంగులతో కురవసాగింది.
”ఆహా ఏడు రంగుల వాన” అని గట్టిగా అరిచాడు వర్షిత్. పక్కనే ఉన్న అమ్మ ”ఏంటి వర్షిత్. ఏమైంది అలా కలవరిస్తున్నావు” అని అని తట్టింది. వెంటనే మెలకువలోకి వచ్చిన వర్షిత్‌కు ‘ఇది కల’ అని అర్థమైంది. కానీ కల వర్షిత్‌కు బాగా నచ్చింది.
తెల్లారి తనకు వచ్చిన కలను అమ్మకు, ప్రకృత్‌కు చెప్పాడు. ఆ సంవత్సరం నుండి ప్రతి పుట్టినరోజుకి ఇద్దరూ మొక్కలు నాటడం మొదలుపెట్టారు. వనదేవత చాలా సంతోషించింది.
ముక్కామల జానకీరామ్, 6305393291