అనతి కాలంలోనే తెలుగు బాల సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన విశిష్ట బాలల రచయిత ముక్కామల జానకి రామ్. తాను రాస్తూ తన విద్యార్థుల చేత రాయిస్తూ ఇటు బాలల రచయితగా, అటు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అప్రతిహతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
కరోనా కాలంలో ఏర్పడిన విద్యా సంక్షోభంలో ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లలు మొబైల్ కంప్యూటర్లపై అధికంగా ఆధారపడవలసిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. తదనంతరం పిల్లలకు మొబైల్ వినియోగం అలవాటుగా మారిపోయింది కరోనా అనంతరం కూడా మొబైల్ ఫోన్ విడిచిపెట్టలేని వ్యసనస్థితికి పిల్లలు చేరుకున్నారు. దీనివల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువ అని గమనించిన జానకిరామ్ పిల్లలను ఆఫ్‌లైన్ చదువుల వైపు మళ్ళించడానికి తన కథలను అస్త్రంగా ప్రయోగించాడు. తన తొలి కథా సంకలనం ఆఫ్ లైన్ విద్యార్థులకు ఎంతో చేరువైంది. విద్యార్థులను మొబైల్ వినియోగం నుంచి దూరం చేయడానికి ఈ కథలు ఎంతగానో ఉపకరించాయి. ఇదే ఉత్సాహంతో జానకిరామ్ రాసిన రెండవ పుస్తకం ఏడు రంగుల వాన. నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ వారు పూర్తి రంగుల బొమ్మలతో ముద్రించిన పుస్తకమిది.
ఇందులోని కథలన్నీ పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. జానకిరామ్ శైలి ఆ విధంగా ఉంటుంది. పిల్లల స్థాయికి తగ్గట్టుగా భాష, కథా వస్తువు, కథా నిర్మాణ దక్షత జానకిరామ్ ప్రత్యేకతలు.
‘ఏడు రంగుల వాన’ లోని 27 కథల్లో మొదటి కథ సింహం ఓ బుజ్జి మేక. ఆపదలో ఉన్నవారికి ఆశ్రయం ఇవ్వాలి కానీ హాని తలపెట్టకూడదనే ధర్మాన్ని పిల్లల్లో నూరి పోయడానికి రచయిత చక్కగా ఈ కథను ఉపయోగించుకున్నాడు. ఒకనాడు బాలలను ఉర్రూతలూగించిన చందమామ, బాలమిత్ర పుస్తకాలలో వచ్చే జానపద కథలను పోలిన కథ ఘటమయ్య సమయస్ఫూర్తి. కథా రచనలో జానకిరామ్ సమయస్ఫూర్తిని చాటే కథ కూడా. కథలో పాత్రల పేర్లు పెట్టాల్సి వచ్చినప్పుడు కుండలు చేసే కుమ్మరి పేరు ఘటమయ్య అని పెట్టడం అత్యంత సముచితంగా కనిపిస్తుంది. రాజుకు కనువిప్పు కలిగించడానికి అత్యంత సామాన్యుడైన ఘటమయ్య చూపిన సమయస్ఫూర్తిని ఈ కథలో చదవవచ్చు. ఇదే కోవలోని మరో కథ ‘సరైన ఎంపిక’. మంత్రి జలంధరుడు అధికారి ఎంపిక కోసం చేసిన పరీక్షలో కేవలం తెలివితేటలే కాక ఆపదలో ఉన్న వారికి సాయం చేసే గుణం ఉన్నవారే అర్హులని చెప్పడం ఈ కథ అందించే నీతి.
అత్యాధునిక సంఘటనలు, వస్తువులను కూడా కథా వస్తువులుగా చేసుకుని చక్కని కథలు నిర్మించడంలో జానకిరామ్ అందవేసిన చేయి. ఇటీవలి కాలంలో సెల్ఫీ మోజులో ప్రాణాలు కోల్పోతున్న పిల్లలు, యువత గురించి పత్రికల్లో చదువుతున్నాం. అటువంటి ప్రమాదం నుంచి పిల్లలను జాగరూకులను చేయడానికి జానకిరామ్ రాసిన కథ కుందేలు సెల్ఫీ. ‘ఫొటో మధుర జ్ఞాపకంగా ఉండాలి. కానీ ఫొటో కోసం మనమే కన్న వాళ్లకు జ్ఞాపకంగా మిగిలిపోకూడదు’ అంటాడు రచయిత. ఇది అందరం ఆలోచించాల్సిన అంశం. ఇంటర్నెట్ కేఫ్ అనే కథ కూడా ఈ కోవలోనిదే. కంప్యూటర్ మంచికి ఉపయోగిస్తే ప్రపంచ విజ్ఞానాన్నంతా సొంతం చేసుకోవచ్చు. చెడుకు ఉపయోగిస్తే వ్యర్థమైన గేమ్స్ వంటి వాటికి బానిసగా మారే ప్రమాదం ఉంది.
ఎవరు ఏ విషయాన్నయినా గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాకిని మోసం చేసిన టక్కరి కోతి కథ ద్వారా రచయిత ఈ విషయాన్ని ఎరుకపరిచారు. పెద్దలపట్ల గౌరవాన్ని ప్రకటించాలని జానకిరామ్ పాత్ర ద్వారా చైత్రకు తెలియజెప్పిన కథ గౌరవం. పాఠాన్ని కూడా కథగా మార్చే నేర్పు జానకిరామ్ సొంతం. గ్రామానికి వచ్చిన ముప్పును తప్పించే కథ చదువు చేసిన మేలు. సొంత ఆలోచన, స్థిరచితం కలిగిన వారే జీవితంలో రాణిస్తారు. కాబట్టి దఢ చిత్తాన్ని అలవర్చుకోవాలని చెప్పే వ్యక్తిత్వ వికాస పాఠం స్థిరమైన మనసు అనే కథ. అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అనే సూక్తిని చాటి చెప్పే కథ పూల చెట్టు నవ్వింది. పిల్లల్లో దేశభక్తిని ప్రోదిచేసే కథ బాధ్యత.
విద్యార్థులలో పర్యావరణ స్పహను రగిల్చడానికి, మొక్కలను పెంచవలసిన ఆవశ్యకతను తెలియజెప్పడానికి ఏడురంగుల వాన కథ ఎంతగానో ఉపకరిస్తుంది. మనం మంచి మనసుతో ఇతరుల పట్ల ప్రేమ భావనతో ఉన్నప్పుడు ఇతరులు కూడా మన పట్ల అంతే ప్రేమ భావనతో ఆపదలో ఆదుకుంటారని చెప్పే కథ మంచి మనసు. కౌమార దశలో ఉన్న పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు సున్నితంగా వ్యవహరించవలసిన అవసరాన్ని తెలియజేసే కథ ‘నాన్న నేర్పిన పాఠం’. గర్వం పనికిరాదని, పాలకులు పాలితుల పట్ల దయతో ఉండాలని, రాజుకు ప్రజల సంక్షేమమే ప్రధానం కావాలని తెలిపే కథ ‘జింక, సింహం ఓ పరుగు పందెం’. గర్వం మన గొప్పదనాన్ని తగ్గిస్తుంది అని చెప్పే కథ ‘గర్వానికి పోవద్దు’. జానకిరామ్ కథల్లో పశుపక్షాదులే కాదు ప్రాణం లేని వస్తువులు కూడా పాత్రధారులు కావడం ఈ కథలో గమనించవచ్చు.
స్నేహం గొప్పదనాన్ని బద్ధకం వీడాలనే సందేశాన్నిచ్చిన కథ చిలుక స్నేహం. జీవకారుణ్య భావనను వ్యక్తపరిచిన కథ మనసున్న వానరం. ప్రేమతో చెబితే పిల్లల్లో తప్పక మార్పు వస్తుందని తెలియజేసే కథ తల్లి ప్రేమ. ప్రకతిని పరిరక్షించుకోవాలి అని సందేశం ఇచ్చే కథ చలువ పందిరి. సందేహ నివత్తి కోసం సంకోచ పడకూడదని చెప్పే కథ ‘తీరిన కొంగ అనుమానం’. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే అసలైన మిత్ర ధర్మమని తెలిపే కథ ‘కొలనులో చేప కొమ్మపై కోతి’. తప్పు చేసిన వారే తమ తప్పు తెలుసుకునేటట్లు చేయడం ఉత్తముల లక్షణం. ‘గోవిందయ్య మారిపోయాడు’ కథలో ఈ అంశాన్ని గమనించవచ్చు. స్వార్థంతో సంకుచితంగా వ్యవహరించిన వ్యక్తికి కూడా సహాయం చేయడం ద్వారా అతనిలో పరివర్తన తీసుకురావచ్చు అని చెప్పే కథ ‘ సీతమ్మ వనంలో స్నేహం. మనం ఒకరికి మేలు చేసినప్పుడు ఆ మేలే మనం ఆపద కాలంలో ఉన్నప్పుడు కాపాడుతుంది అనే సందేశాన్ని ఇచ్చే కథ ‘రామవ్వ.. సింహం.. ఓ కథ’. మన సంస్కతి సంప్రదాయాలను కాపాడుతూ ముందు తరాలకు అందించాలి అని తెలిపే కథ బహుమానం. మనం చేసే వత్తిలో నిజాయితీ లేనప్పుడు చెడు ఫలితాలు వస్తాయని తెలిపే కథ ‘జగన్నాథం మారిపోయాడు’.
ఏడు రంగుల వానలో ఉన్న కథలన్నీ ప్రముఖ దినపత్రికల్లో ప్రచురితమైనవే. బాల సాహిత్యంలో జానకిరామ్ నుండి గొప్ప గ్రంథాలు వెలువడాలని ఆకాంక్షిద్దాం.
– డాక్టర్ సాగర్ల సత్తయ్య, 7989117415