– చికిత్స కోసం ఆస్పత్రికి తరలింపు
– నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలం ఆదర్శ పాఠశాల హాస్టల్‌లో ఘటన
నవతెలంగాణ-పెద్ద అడిశర్లపల్లి
నల్లగొండ జిల్లా పెద్దఅడి శర్లపల్లి మండలంలోని దుగ్యాల గ్రామపంచాయతీ పరిధిలోని ఆదర్శ పాఠశాల వసతి గృహంలో మధ్యాహ్న భోజనం వికటించి ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన మంగళ వారం చోటు చేసుకుంది. విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. నాణ్యత లేని బియ్యం వండటంతో అది తిని అజీర్తితో కడుపులో నొప్పి వచ్చిందని తెలిపారు. ఏడు గురు విద్యార్థినుల్లో నలుగురికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగతా ముగ్గురు స్థానిక ఆర్‌ఎంపీ డాక్టర్ వద్ద చికిత్స తీసుకుంటున్నారు.
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమడుతున్న ప్రభుత్వం : ఎస్‌ఎఫ్‌ఐ
విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమడుతోందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఆకారపు నరేశ్, కంభంపాటి శంకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీఏపల్లి మండలం ఆదర్శపాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుసగా ఫుడ్‌పాయిజన్ సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.