ఉన్నత అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు..

– సస్పెండ్, బదిలీలు మాని కంటితుడుపు సందర్శన
నవతెలంగాణ – ఆళ్ళపల్లి : ఆళ్ళపల్లి మండలంలో గత మార్చి నుంచి 2024 మార్చి నెల వరకు సంవత్సరాల కాలంలో జరిగిన సుమారు 2 కోట్ల ఈజీఎస్ పనుల్లో జరిగిన ఈజీఎస్ సిబ్బంది, కార్యదర్శుల లక్షల రూపాయల అక్రమాలు, అవకతవకలపై చర్యలు మాని సంబంధిత జిల్లా అధికారులు మౌనంగా ఉండటంపై మండలంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజల్లో సర్వత్రా విమర్శలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. అక్రమంగా సంపాదించిన అక్రమార్కులను పట్టుకుని వారిని సస్పెండ్, బదిలీలు, షోకాజ్ నోటీసుల ఉత్తర్వులు ఇవ్వడం మాని కంటితుడుపు చర్యలుగా జిల్లా అధికారులు శుక్రవారం మండలాన్ని సందర్శించడంతో మండల వాసుల అనేక అనుమానాలకు తావిస్తోంది. గత ఓపెన్ ఫోరంలో స్వయంగా జిల్లా అధికారుల ముందు మండలంలో జరిగిన ఉపాధి పనుల్లో అనేక అక్రమాలను ఉపాధి తనిఖీ బృందం స్పష్టంగా ఆధారాలతో చూపించింది. దానిపై జిల్లా అధికారులు కంటితుడుపుగా 2 లక్షల 37 వేల రూపాయలు రికవరీ, పెనాల్టీగా 34 వేలు వేశారు. దాంతో తనిఖీ బృందం చూపెట్టిన తప్పులకి, సంబంధిత జిల్లా అధికారులు విధించిన పెనాల్టీ, రికవరీకి పొంతన లేకుండా పోయింది. ఆళ్ళపల్లి మండలంలో ఉపాధి అక్రమాలకు పాల్పడిన అధికారులను జిల్లా అధికారులు ఉద్దేశపూర్వకంగానే కాపాడుకుంటూ వస్తున్నారని మండలంలో ప్రజల నోట తీవ్రమైన చర్చలు, ఆరోపణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా డీఆర్ డీవో (పీడీ) విద్య చందన ఆళ్ళపల్లి మండలంలో ఉపాధి అక్రమాలపై చర్యలు తీసుకునేందుకు వచ్చారని చర్చ జరిగింది. కానీ, ఆమె మాత్రం ఉపాధి అధికారులతో సమావేశం నిర్వహించి, మండలంలో పలు నర్సరీలను పరిశీలించి వెళ్లిపోయారు. ఉపాధి హామీ పథకంలో మండలంలో అనేక అక్రమాలు జరిగినప్పటికీ జిల్లా అధికారులు వారిని వెనుక వేసుకొస్తూ ఉండటం వెనక సంబంధిత ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు అందాయని, దాంతోనే వారు మౌనంగా ఉన్నారనే విమర్శలు మండలంలో గుప్పుమంటున్నాయి. ఇకనైనా జిల్లా కలెక్టర్ ఉపాధి అక్రమాలపై దృష్టి పెట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మండలంలోని వివిధ పార్టీ నాయకులు, మండల వాసులు కోరుతున్నారు.