తీవ్ర అస్వస్థత

తీవ్ర
అస్వస్థతబాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బ్రైయిన్‌ స్ట్రోక్‌ రావడంతో కుటుంబ సభ్యులు శనివారం ఉదయం ఆయన్ని కోల్‌కతాలోని అపోలోహాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ‘మిథున్‌ ప్రస్తుతం మా చికిత్సకు రెస్పాండ్‌ అవుతున్నారు. గుండె, నరాలకు సంబంధించిన వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు’ అని హాస్పిటల్‌ వర్గాలు తెలిపాయి.
‘డిస్కో డాన్సర్‌’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మిథున్‌ చక్రవర్తి దాదాపు ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. 1976లో మృణాల్‌సేన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘మృగయా’ చిత్రంలో నటించారు. నటించిన తొలి చిత్రంతోనే జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. బెంగాలీ, హిందీ, ఒడిశా, భోజ్‌పురి, తమిళం, కన్నడ, పంజాబీ, తెలుగు భాషల్లో దాదాపు 350 చిత్రాల్లో నటించారు. ఇటీవల ఆయనకు కేంద్రప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారాని ప్రకటించింది.