నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణంలోని సువాలీ ఎస్టేట్లో జ్యుక్షియో డేటా కన్సోలేషన్ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 900 మంది ఉద్యోగస్తులను అకారణంగా సంస్థ యజమాన్యం తొలగించడం దారుణమని వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ డిమాండ్ చేశారు. బుధవారం ఉద్యోగస్తుల సమస్యలను స్థానిక అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కు వినతి పత్రం ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థ యజమాన్యం ఉద్యోగస్తులను మహిళలు అని చూడకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఎలాంటి నోటీసులు లేకుండా వారిని ఉద్యోగం నుండి తొలగిస్తున్నామని బలవంతంగా సంతకాలు చేయించి వారి మెయిల్ పాస్వర్డ్ లను తీసుకొని స్వచ్ఛందంగా ఉద్యోగాలను విరమిస్తున్నట్లు రాతపూర్వక ఒప్పంద పత్రాలను తయారు చేసి ఉద్యోగస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు అన్నారు. వెంటనే యజమాన్యంపై చట్టరీత్యా ఉద్యోగస్తులకు రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను కల్పిస్తూ తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వీరితోపాటు పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, డివైఎఫ్ఐ నాయకులు షేక్ రియాజ్, సాజిద్, సోహెల్, ఫయాజ్, ఉద్యోగస్తులు పాల్గొన్నారు.