– సినీ పరిశ్రమపై కేరళ ప్రభుత్వ కమిటీ నివేదిక
– వ్యవస్థలో మార్పులు అవసరమన్న ప్రముఖులు
తిరువనంతపురం : కేరళలో ప్రముఖ నటీమణిపై 2017లో జరిగిన లైంగిక దాడి నేపథ్యంలో మళయాళ సినీ పరిశ్రమకు చెందిన 18 మంది మహిళలు ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ (డబ్ల్యూసీసీ) పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశారు. సినీ పరిశ్రమను మహిళలకు మెరుగైన పని ప్రదేశంగా చేయడమే దీని ఉద్దేశం. డబ్ల్యూసీసీ సిఫార్సుల ఆధారంగా కేరళ ప్రభుత్వం జస్టిస్ కె.హేమ (రిటైర్డ్) నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించిన ఈ కమిటీ 2019లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా ఈ నెల 19న దానిని ప్రజలకు బహిర్గతం చేశారు. పురుషాధిక్య పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపులు, లింగపరమైన పక్షపాతం, వివక్షను ఎదుర్కొంటున్నారని 235 పేజీల నివేదిక తేల్చింది.
త్రిసభ్య కమిటీ నివేదికపై ‘ది క్వింట్’ పోర్టల్ సినీ డిటర్, డబ్ల్యూసీసీ వ్యవస్థాపక సభ్యురాలు బినా పాల్ స్పందన కోరింది. భారతీయ సినీ పరిశ్రమలో నెలకొన్న ఫ్యూడల్, తిరోగమన మనస్తత్వాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. మళయాళ సినీ పరిశ్రమలోని వారందరితో సంప్రదింపులు జరిపి వ్యవస్థలో అవసరమైన మార్పులు చేయాలని ఆమె సూచించారు. మీటూ ఉద్యమం, డబ్ల్యూసీసీ ఏర్పడిన తర్వాత మహిళల నుండి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది. అది లైంగిక వేధింపు అయినా, వేతనాల చెల్లింపులో వ్యత్యాసం అయినా, గౌరవానికి సంబంధించిన విషయమైనా… ఇవన్నీ మహిళలను చిన్నచూపు చూసేవే. ఇది కేవలం మళయాళ సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, దేశంలోని అన్ని పరిశ్రమల్లోనూ ఉన్నదేనని బినా పాల్ తెలిపారు. పరిస్థితులు ఊహించిన దాని కంటే దారుణంగా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. నకిలీ ప్రకటనలు చూసి ఊహాలోకంలో తేలిపోయిన మహిళలు మాత్రమే ఇలాంటి అనుభవాలను ఎదుర్కొం టున్నారని కమిటీ ఎదుట హాజరైన కొందరు పురుషులు వాదించారు. పైగా ఈ పరిణామాలు కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కావని, దేశంలోని అన్ని పరిశ్రమలలోనూ చోటుచేసుకుంటున్నవేనని కూడా వారు తెలిపారు. నివేదికలో వ్యక్తుల పేర్లు కన్పించకపోవడంపై అడిగిన ప్రశ్నకు బినా పాల్ బదులిస్తూ కొందరిని లక్ష్యంగా చేసుకొని వేటాడడం తమ పని కాదని చెప్పారు. ఎవరు ఏ తప్పు చేశారో తెలుసుకోవడం తమ పని కాదని, దానిపై ప్రజలే ఆలోచించాలని తెలిపారు. మరోసారి బయటికి వచ్చి మాట్లాడమని మహిళలను కోరడం చాలా కష్టమని, ప్రజలు చర్యను కోరుకుంటేనే అది జరుగుతుందని అన్నారు. మళయాళ సినీ పరిశ్రమలో ఓ శక్తివంతమైన గ్రూపు ఉన్నదన్న విషయం తనకు తెలియదని బినా పాల్ చెప్పారు.