లైంగిక వేధింపులు, దాడులను అరికట్టాలి

– నిందితులను కఠినంగా శిక్షించాలి : ఐద్వా
– ఐద్వా హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడులను, వేధింపులను వెంటనే అరికట్టాలని ఐద్వా హైదరాబాద్‌ నగర అధ్యక్ష కార్యదర్శులు ఏ.పద్మ, కె.నాగలకిë ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఐద్వా హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌ గోల్కొండ ఎక్స్‌రోడ్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా నగర అధ్యక్షులు ఏ.పద్మ మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో బాలికలపై లైంగిక వేధింపులపై ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎల్‌బీనగర్‌లో గిరిజన మహిళను లాకప్‌లో వేసి పోలీసులు తీవ్రంగా హింసించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లిలో మధ్యప్రదేశ్‌ నుంచి వలస వచ్చిన భవన నిర్మాణ కార్మిక కుటుంబానికి చెందిన బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆపై హత్య చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజూ ఏదోఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుండటంతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఎన్నో ఆందోళనలు చేసిన తర్వాత మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మహిళా కమిషన్‌ ఏర్పాటైనా అనుకున్న తీరులో పనిచేయడం లేదన్నారు. మహిళలపై దాడులు పెరుగుతున్నా మహిళా కమిషన్‌ స్పందన కరువైందన్నారు. బాధితులను కలిసి వారికి న్యాయం చేద్దామన్న ఆలోచన కూడా చేయడం లేదని విమర్శించారు. మహిళలపై జరుగుతున్న సంఘటనలపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని, సమగ్ర విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రాష్ట్రంలో జెండర్‌ సెన్సివిటీపై విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి సంస్థలో లైంగిక వేధింపులపై ఫిర్యాదు కమిటీలను ఏర్పాటు చేయాలని, రాత్రి వేళల్లో పోలీస్‌ పెట్రోలింగ్‌ పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పీ.విమల, లక్ష్మీ, పుష్పా, లావణ్య, మణెమ్మ, అనంతమ్మ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.