– సెంట్రల్ ప్యానెల్ క్లీన్‌స్వీప్
– 42 కౌన్సిలర్లలో 30 స్థానాలు కైవసం
– మట్టికరిచిన ఏబీవీపీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోనే ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో నిర్వహించిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి ఘన విజయం సాధించింది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి పోస్టులతో సెంట్రల్ ప్యానెల్‌ను ఎస్‌ఎఫ్‌ఐ క్లీన్‌స్వీప్ చేసింది. బీజేపీ అనుబంధ ఏబీవీపీ మట్టికరించింది. ఎన్ని కుయుక్తలకు పాల్పడినప్పటికీ ఏబీవీపీ ఓటమి చెందింది. ఏబీవీపీని, దాని మతోన్మాద సిద్ధాంతాన్ని జెఎన్‌యు విద్యార్థులు తిరస్కరించారు. అధికారులతో కుమ్మక్కైన ఏబీవీపీ విధ్వంసక ప్రయత్నాలను ఎస్‌ఎఫ్‌ఐ కూటమి సమర్థవంతంగా ఎదుర్కొంది.
అధ్యక్ష పదవికి ఏబీవీపీ తరపున పోటీ చేసిన ఉమేష్ చంద్ర అజ్మీరా (2,118 ఓట్లు)పై ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థి ధనుంజరు (3,100 ఓట్లు) విజయం సాధించారు. బాప్సా తరపున పోటీ చేసిన బిస్వజిత్ మింజికి కేవలం 282 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉపాధ్య పదవికి ఏబీవీపీ తరపున పోటీ చేసిన దీపికా శర్మ (1,848 ఓట్లు)పై ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థి అవిజిత్ ఘోష్ (2,762 ఓట్లు) భారీ మెజార్టీతో విజయం సాధించారు. బాప్సా తరపున పోటీ చేసిన మొహమ్మద్ అనాస్‌కు కేవలం 463 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రధాన కార్యదర్శి పదవికి ఎఐఎస్‌ఎఫ్ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ప్రియాంషి ఆర్యను ఎస్‌ఎఫ్‌ఐ కూటమి బలపర్చింది. ఏబీవీపీ అభ్యర్థి అర్జున్ ఆనంద్ (2,412 ఓట్లు)పై ఆమె (3,440 ఓట్లు) అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. సహాయ కార్యదర్శి పదవికి ఏబీవీపీ తరపున పోటీ చేసిన గోవింద్ డాంగి (2,591 ఓట్లు)పై కుటమి అభ్యర్థి మో సాజిద్ (3,035 ఓట్లు) ఘన విజయం సాధించారు. 42 మంది కౌన్సిలర్లలో 30 మంది ఎస్‌ఎఫ్‌ఐ కూటమికి చెందినవారే కావడం విశేషం.