హెచ్‌సీయూలో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి జయకేతనం

SFI alliance triumphs in HCU– అన్ని పోస్టులూ మరోసారి క్లీన్‌స్వీప్‌
– అధ్యక్షునిగా అతీక్‌ అహ్మద్‌ ఘనవిజయం
– మతోన్మాద ఏబీవీపీకి పరాభవం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో ఎస్‌ఎఫ్‌ఐ జెండా రెపరెపలాడింది. హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ-ఏఎస్‌ఏ-టీఎస్‌ఎఫ్‌ కూటమి జయకేతనం ఎగురవేసింది. ప్రగతిశీల శక్తులు, అభ్యుదయ భావాలకే విద్యార్థులు పట్టం కట్టారు. మొదటి రౌండ్‌ ఓట్ల లెక్కింపు నుంచి ఎస్‌ఎఫ్‌ఐ కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అన్ని పోస్టులనూ ఎస్‌ఎఫ్‌ఐ కూటమి క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ ఎన్నికల్లో మతోన్మాద ఏబీవీపీకి ఘోర పరాభవం ఎదురైంది. విశ్వవిద్యాలయాల్లో మతోన్మాద రాజకీయాలకు తావులేదని విద్యార్థులు మరోసారి నిరూపించారు. ఎన్‌ఎస్‌యూఐ, డీఎస్‌యూ కూటములు ప్రభావాన్ని చూపలేకపోయాయి. హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థి అతీక్‌ అహ్మద్‌ ఘనవిజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా జె ఆకాశ్‌, ప్రధాన కార్యదర్శిగా దీపక్‌ కుమార్‌ ఆర్య, సంయుక్త కార్యదర్శిగా లావుడి బాల ఆంజనేయులు, సాంస్కృతిక కార్యదర్శిగా సమీన్‌ అక్తర్‌, క్రీడల కార్యదర్శిగా అతుల్‌ గెలుపొందారు. ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థులందరూ ఘనవిజయం సాధించడంతో అక్కడ సంబురాలు అంబరాన్నంటాయి. అతీక్‌ అహ్మద్‌తోపాటు గెలిచిన ఇతర అభ్యర్థులను విద్యార్థులు ఎత్తుకుని హెచ్‌సీయూ ప్రాంగణమంతా నినాదాలతో ఊరేగించారు. ఈ సమయంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఏ, టీఎస్‌ఎఫ్‌ జెండాలు రెపరెపలాడాయి. డప్పు, బ్యాండ్‌ బాజాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ సంబురాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు. ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిందాబాద్‌, ఏబీవీపీ ముర్దాబాద్‌, విశాల భారతదేశమంతటా ఎస్‌ఎఫ్‌ఐదే విజయబావుటా’అన్న నినాదాలతో ఆ ప్రాంగణమంతా మార్మోగిపోయింది.
అతీక్‌ అహ్మద్‌కు 471 ఓట్ల మెజార్టీ
హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి నుంచి అధ్యక్షునిగా పోటీ చేసిన అతీక్‌ అహ్మద్‌కు 1880 ఓట్లు వచ్చాయి. ఏబీవీపీ కూటమి నుంచి అధ్యక్షునిగా పోటీ చేసిన షేక్‌ ఆయేషాకు 1409 ఓట్లు, డీఎస్‌యూ నుంచి పోటీ చేసిన ఉమేష్‌ అంబేద్కర్‌కు 424 ఓట్లు, ఎన్‌ఎస్‌యూఐ నుంచి పోటీ చేసిన అమల్‌ జోస్‌ ఫిలిప్‌కు 345 ఓట్లొచ్చాయి. దీంతో ఏబీవీపీ కూటమి అభ్యర్థి ఆయేషాపై ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థి అతీక్‌ అహ్మద్‌ 471 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఎస్‌ఎఫ్‌ఐ-ఏఎస్‌ఏ-టీఎస్‌ఎఫ్‌ కూటమి నుంచి ఉపాధ్యక్షునిగా పోటీ చేసిన జల్లి ఆకాశ్‌కు 1,671 ఓట్లు, ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసిన దీపక్‌ కుమార్‌ ఆర్యకు 1,765 ఓట్లు, సంయుక్త కార్యదర్శిగా పోటీ చేసిన లావుడి బాల ఆంజనేయులుకు 1,775 ఓట్లు, సాంస్కృతిక కార్యదర్శి షమీమ్‌ అక్తర్‌ షేక్‌కు 1,656 ఓట్లు, క్రీడల కార్యదర్శిగా పోటీ చేసిన అతుల్‌కు 1,642 ఓట్లు వచ్చాయి. వారంతా ఏబీవీపీ కూటమి అభ్యర్థులపై గెలుపొందారు.
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ హర్షం
హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఏ, టీఎస్‌ఎఫ్‌ కూటమి అభ్యర్థులందరూ ఘన విజయం సాధించడం పట్ల ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. గెలుపొందిన వారికి అభినందనలు తెలిపింది. హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో మతోన్మాద ఏబీవీపీ కూటమిని విద్యార్థులు మట్టికరిపించారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు తెలిపారు. ఈ విజయం కోసం కృషి చేసిన విద్యార్థులకు ధన్యవాదాలు ప్రకటించారు. ఈ ఎన్నికల పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ప్రక్రియను వారు అక్కడే ఉండి పర్యవేక్షించారు. విజయోత్సవంలో భాగస్వాములయ్యారు.