– పెండింగ్ స్కాలర్‌షిప్స్, రియంబర్స్‌మెంట్‌పై కదం తొక్కిన విద్యార్థులు
– విద్యార్థి నాయకులపై పోలీసుల దాడి, అరెస్టు
– ముందస్తు అరెస్టులు, దాడిని ఖండిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎస్‌ఎఫ్‌ఐ ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. మూడేండ్లుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలనీ, విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆదివారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని అసెంబ్లీకి చేరుకున్న విద్యార్ధులు, నాయకులు.. నినాదాలు చేస్తూ అసెంబ్లీ వైపునకు దూసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకొని వారిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి
ఎస్‌ఎఫ్‌ఐ చలో అసెంబ్లీ ఉద్రిక్తం గోషామహల్, చిక్కడపల్లి, నాంపల్లి, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అర్థరాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకత్వాన్ని ముందస్తుగా అరెస్టు చేయడాన్ని, అసెంబ్లీ దగ్గర పోలీసుల దాడిని ఖండిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మూడేండ్లుగా రూ.5,177 కోట్ల స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ను విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిధులు బడ్జెట్‌లో 0.1 శాతం కూడా కావన్నారు. సీఎం, మంత్రి, ఎమ్మెల్యేలకు ఒక్క నెల జీతం కూడా పెండింగ్‌లో లేదు కానీ విద్యార్థుల స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎందుకు పెండింగ్‌లో ఉంచారని ప్రశ్నించారు. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ యూనిఫామ్స్ ఇవ్వలేదనీ, ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు లేవనీ, లెక్చరర్స్, టీచర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయలేదని విమర్శించారు. విద్యార్థులు పంద్రాగస్టు రోజున కూడా పాత బట్టలతోనే స్కూల్‌కు వెళ్లాలా.. అని ప్రశ్నించారు. గురుకులాలు మరీ అధ్వాన్నంగా మారాయని, 1008 గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయన్నారు. కనీస సౌకర్యాలు లేవని, సన్నబియ్యం పెడుతున్నామని చెబుతున్నా ఆచరణలో అమలు కావడం లేదని తెలిపారు. మెస్ బిల్లులు రాక.. నాణ్యమైన భోజనం అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు హాస్టల్ విద్యార్ధులకు ఇస్తున్న కాస్మోటిక్ ఛార్జీలు (బాలురకు రూ.62, బాలికలకు రూ.150) 8 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభిస్తున్నట్టు 2018లో ప్రభుత్వం చెప్పినా.. ఇప్పటికీ అమలుకు నోచుకోలేదనీ, వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రయివేటు యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వ యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలని కోరారు. నూతన విద్యావిధానం 2020 తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని, తక్షణమే గురుకుల విద్యార్ధుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు
డిమాండ్స్ నెరవేర్చాలని, సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు, అధ్యక్షులు మూర్తి, సహాయ కార్యదర్శి మిశ్రీన్, కె.ప్రశాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు రమ్య, యార ప్రశాంత్‌పై పోలీసులు భౌతిక దాడి చేశారు. విద్యార్ధులని కూడా చూడకుండా చొక్కాలు చించి బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్‌లో ఎత్తి పడేశారు. శనివారం అర్ధరాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, కార్యకర్తల ఇండ్లకు వెళ్ళి మరీ ముందస్తు అరెస్టులు చేశారు. ఈ అక్రమ అరెస్టులను, అసెంబ్లీ దగ్గర పోలీసు దాడులను ఖండిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.ప్రశాంత్, మమత, సంతోష్ రాథోడ్, బి.శంకర్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు దామెర కిరణ్, మిశ్రీన్ సుల్తాన, అశోక్‌రెడ్డి, దాసరి ప్రశాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరవింద్, యార ప్రశాంత్, డి.సందీప్, రమ్య, భరత్, లెనిన్, జె.రమేష్, పాల్గొన్నారు.