నవతెలంగాణ-వైరాటౌన్
ఎస్‌ఎఫ్‌ఐ వైరా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రయివేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కార్పొరేట్ స్థాయిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, దీనికి గత తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలని, కానీ నిర్లక్ష్యం చేస్తుందని, దీని ఫలితంగానే పేద విద్యార్థులు విద్యకు దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తల్లిదండ్రులపై అధిక భారం పడిందని, తమ ఆదాయంలో అధిక భాగం విద్యపై ఖర్చు చేయాల్సి వచ్చిందని, ఇప్పుడున్న ఫీజుల స్థాయిని, తల్లిదండ్రులపై ఉన్న మోయలేని భారాన్ని వెంటనే ప్రభుత్వం అర్థం చేసుకొని ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న తరుణంలో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నర్సరీలో లక్షకుపైగా ఫీజులు వసూలు చేయడం వల్ల మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు చదువుకు దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం వెంటనే కార్పొరేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) వైరా రూరల్ మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ వైరా డివిజన్ అధ్యక్షులు పుప్పాల నాగరాజు, కమిటీ సభ్యులు రామిశెట్టి ఉపేందర్, గణేష్, సాయి, విద్యార్థులు పాల్గొన్నారు.