నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మహబూబ్‌నగర్‌లో విద్యార్థి నాయకులపై బీజేపీ గూండాల దాడిని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) తీవ్రంగా ఖండించింది. ప్రవేశ పరీక్షల నిర్వహణలో వైఫల్యం, అవినీతికి పాల్పడుతున్న మోడీ ప్రభుత్వం, ప్రశ్నాపత్రాల లీకేజీతో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎంపీల క్యాంపు కార్యాలయాలను శనివారం ముట్టడించారు. ఈ పిలుపులో భాగంగా మహబూబ్‌నగర్ ఎంపీ డికె అరుణ క్యాంపు కార్యాలయం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ నాయకులపై బీజేపీ నాయకులు కర్రలతో దాడికి పాల్పడ్డారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు తెలిపారు. విద్యార్థి నాయకులను పిడిగుద్దులు గుద్దుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారని విమర్శించారు.బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే భౌతిక దాడులకు పాల్పడకుండా నీట్, యూజీసీ నెట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వల్ల నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రధాని మోడీని నిలదీయాలని కోరారు. కానీ పోరాడే విద్యార్థి నాయకులపై భౌతిక దాడులకు పాల్పడడం సమంజసం కాదని తెలిపారు.
దాడులకు పాల్పడితే భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.