– విద్యార్థులను రౌడీల్లా అరెస్టు చేసి కేసులు నమోదు చేయడం దుర్మార్గం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ ఇంగ్లీషు అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శీటీ (ఇప్లూ)లో అప్రజాస్వామిక చర్యలను భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతనెల 18న విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందని తెలిపారు. దీంతో విద్యార్థులకు భద్రత కల్పించడంలో ఇఫ్లూ పరిపాలన విభాగం విఫలమైందని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో వీసీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. వీసీ పదవీకాలం పూర్తయినా కూడా కేంద్ర ప్రభుత్వం అండదండలతో వర్సిటీలో విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడిని నిగ్గు తేల్చాలంటూ ఆందోళన కొనసాగిస్తునే ఉన్నారని తెలిపారు. నిరసన దీక్ష చేస్తున్న విద్యార్థులను ఓయూ పోలీసులు గేట్లకు తాళం వేసి నిర్బంధించారని పేర్కొన్నారు. వారికి మద్దతుగా నిలబడిన హెచ్‌సీయూ విద్యార్థులను గేట్ ముందు బలవంతంగా అరెస్టు చేశారని తెలిపారు. 32 మంది విద్యార్థులపై క్రిమినల్ కేసులు పెట్టారరని పేర్కొన్నారు. ఇప్లూ యాజమాన్యం, వీసీ విద్యార్థులను రౌడీలుగా భావించి అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారని విమర్శించారు. వీసీని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడి చేసి అక్రమంగా పెట్టిన కేసులను రద్దు చేయాలని కోరారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తరుపున, వారికి మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.