ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీ డైరెక్టర్‌ను అరెస్టు చేయాలి – ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీ అసోసియేట్‌ డైరెక్టర్‌ నారాయణ రాజును అరెస్ట్‌ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో మహిళా మెడికోలను వేధింపులకు గురిచేసినందుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన సస్పెండ్‌ అయ్యారని తెలిపారు. మళ్లీ పలుకుబడి ఉపయోగించుకుని ఉద్యోగంలోకి వచ్చారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఫిర్యాదు చేసిన రష్మిత అనే మెడికోపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆమెను పరీక్షల్లో ఫెయిల్‌ చేసి మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపారు. అయినా వెనక్కి తీసుకోకపోవడంతో ఈ చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. నారాయణరాజును సస్పెండ్‌ చేసి తక్షణమే అరెస్ట్‌ చేయాలనీ, రష్మితకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.