
– మండిపడ్డ ఎస్ఎఫ్ఐ నాయకులు
నవతెలంగాణ- కంటేశ్వర్
కేంద్ర ప్రభుత్వం 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ విద్యారంగానికి నీటి మీద బుడగళ్ల నిధులు కేటాయించడం సరికాదని నిజామాబాద్ జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు శనివారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జి జి కాలేజ్ నందు బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించిందని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ 47 లక్షల 65 వేల 768 కోట్లు ఉంటే అందులో ప్రభుత్వ విద్యారంగా అభివృద్ధి కోసం కేవలం 2.61 శాతం అనగా ఒక లక్ష 24 వేల 36 కోట్లు మాత్రమే కేటాయించిందని, ఈ అరకొర నిధులతో ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో కేంద్ర ప్రభుత్వమే చెప్పాలని అన్నారు. అదేవిధంగా కొఠారి కమిషన్ ప్రకారము కేంద్ర బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయించాలని ఉంటే 2.6% కేటాయించి అందులో యు జి సి కి గతం కంటే 60 శాతం నిధులను తక్కువగా కేటాయించడం, ఐఐఎంలకు 300 కోట్లు, ఉన్నత విద్యకు 47619 కోట్లు, పాఠశాల విద్యకు 73008 కేటాయించి, యధావిధిగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని విస్మరించిందని అని అన్నారు. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం 2020 లో కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తామని మాటల వరకే పరిమితమై, పనులు మాత్రం నీటి మీద బుడగల్లా ఉన్నాయని అన్నారు.అలాగే నవోదయ స్కూల్ గానీ, త్రిబుల్ ఐటీలు గాని ఎన్ఐటీలు గాని కేంద్ర విశ్వవిద్యాలయాలు గాని పెండింగ్ లో ఉన్న ఫెలోషిప్ గురించి గాని ప్రస్తావించకపోవడం బాధాకరమని అన్నారు.అలాగే ప్రైవేటు యూనివర్సిటీలకు విచ్చలవిడిగా పర్మిషన్ ఇస్తు ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే కుట్రలను విద్యార్థులందరూ తెప్పిగొట్టాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక నిధులు కేటాయించే రకంగా చర్యలు తీసుకోకపోతే తీవ్రమైన ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు వేణు దీపిక మరియు నగర నాయకులు సంతోష్ సందేశ్ అశ్విని, రమ్య, శ్రీహరి, రాజు, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.