నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు విమర్శించారు. గత ప్రభుత్వ ఆనవాయితీనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించిందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యకు రూ.21,389 (7.8 శాతం) కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. గత బడ్జెట్‌తో పోల్చితే రూ.2,296 కోట్లు పెరిగాయని వివరించారు. 1.31 శాతం నిధుల పెంపుతో ప్రభుత్వ విద్యారంగం ఎంతమాత్రమూ అభివృద్ధి కాదని ఆందోళన వ్యక్తం చేశారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కేటాయించారని తెలిపారు. వాటితో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పాలనలో విశ్వవిద్యాలయాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మెస్, భవనాలు, ఖాళీల భర్తీ, మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఓయూకు రూ.వెయ్యి కోట్లు, మహిళా వర్సిటీ, బాసర త్రిపుల్‌ఐటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లో నూతన వర్సిటీల ఏర్పాటు కోసం హామీ ఇచ్చిందని తెలిపారు. కానీ వాటి అభివృద్ధికి కేవలం రూ.500 కేటాయించారని పేర్కొన్నారు. 11 వర్సిటీల నిర్వహణకు ఏమాత్రం సరిపోవని తెలిపారు. మరో రెండు త్రిపుల్‌ఐటీలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, మెస్‌చార్జీలపై స్పష్టత కరువైందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి నిధులు శూన్యమని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.7,200 కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. వాటి విడుదల కోసం నిధులు కేటాయించలేదని విమర్శించారు. విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామంటూ హామీ ఇచ్చి 7.8 శాతమే కేటాయించారని తెలిపారు. విద్యకు నిధులను పెంచి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
విద్యకు కేటాయింపులు సరిపోవు : ఏఐఎస్‌ఎఫ్
విద్యారంగానికి కేటాయించిన 7.75 శాతం నిధులు ఏమాత్రం సరిపోవని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ తెలిపారు. బడ్జెట్‌లో విద్యకు 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కానీ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్టుగా 15 శాతం నిధులు విద్యకు కేటాయిస్తే బాగుండేదని పేర్కొన్నారు. వర్సిటీల మౌలిక సదుపాయాల కోసం కేవలం రూ.500 కోట్లు కేటాయించటమేంటని ప్రశ్నించారు. ప్రతి వర్సిటీకి రూ.300 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు కేటాయించాలని డిమాండ్ చేశారు. గురుకులాలకు కొత్త భవనాలే కాకుండా అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్ల భవనాల నిర్మాణానికీ నిధులు కేటాయించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.5,500 కోట్లు విడుదల చేయాలని తెలిపారు. విద్యారంగంలో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీకి జాబ్‌క్యాలెండర్ ప్రకటించాలని కోరారు.
విద్యకు అధిక నిధులు కేటాయించాలి : పీడీఎస్‌యూ
ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి అధిక నిధులను కేటాయించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయల పరుశురాం డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే 15 శాతానికిపైగా నిధులు కేటాయిస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు 7.8 శాతం కేటాయించడం శోచనీయమని విమర్శించారు. రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లు కేటాయించడం సరైంది కాదన్నారు. విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించి సమస్యల నుంచి బయటికి తేవాలని డిమాండ్ చేశారు.