పుస్తకాల దందాపై ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన

– పుస్తకాల విక్రయ కేంద్రాలుగా ప్రయివేటు పాఠశాలలు
– మౌనం వీడని విద్యాశాఖ పుస్తకాల విక్రయాలను అడ్డుకుంటున్న విద్యార్థి సంఘాలు
– తిరిగి యాజమాన్యానికి అప్పగిస్తున్న పోలీసులు
– పక్కదారి పడుతున్న విద్యా హక్కు చట్టం
– అడ్డు అదుపు లేకుండా వేల రూపాయలు గుంజుతున్న పట్టించుకోని వైనం
– హెచ్‌ఆర్‌డీ కళాశాల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ప్రయివేటు పాఠశాలల్లో పుస్తకాల దందాపై ఎస్‌ఎఫ్‌ఐ వరుస ఆందోళన నిర్వహిస్తుంది. ఆయా పాఠశాలల్లో విక్రయిస్తున్న పుస్తకాలను స్వాధీనం చేసుకొని రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ, రెవెన్యూ అధికారులకు, పోలీసులకు అప్పగిస్తున్నారు. కానీ అవ్వే పుస్తకాలు మళ్ళీ తిరిగి పాఠశాల యాజమాన్యానికే పోలీసుల అప్పగిస్తున్నారు. దాంతో పుస్తకాల విక్రయ కేంద్రాలుగా ప్రయివేటు పాఠశాలలు మారిపోయాయి. పేద విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పుస్తకాల రూపంలో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. అయినా విద్యాశాఖ స్పందించడం లేదు. దాంతో విద్యాహక్కు చట్టానికి తోట్లు పడుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో విద్యాశాఖ నిర్లక్ష్యానికి పేదల జేబులకు తూట్లు పడుతన్నాయి.
గత రెండు రోజులుగా ఇబ్రహీంపట్నం డివిజన్‌లో ప్రయివేటు పాఠశాలల్లో పుస్తకాల విక్రయాలపై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. విక్రయిస్తున్న పుస్తకాలను స్వాధీనం చేసుకొని రోడ్లపై బైటాయించి రాస్తారోకో నిర్వహిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాలను విక్రయిస్తున్న ప్రయివేటు పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. సోమవారం ఇబ్రహీంపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు విక్రయిస్తున్న వేలాది పుస్తకాలు స్వాధీనం చేసుకొని విద్యాశాఖ అధికారులకు అప్పజెప్పారు. మంగళవారం ఇబ్రహీంపట్నం సమీపంలోని హెచ్‌ఆర్డీ పాఠశాలలో విక్రయిస్తున్న పాఠ్యపుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. పెన్సిల్‌ మొదలుకొని నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలతో యుక్తంగా స్వాధీనం చేసుకొని కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. జిల్లా విద్యాధికారి స్పందించి పాఠశాల వద్దకు రావాలని నినదించారు. దాంతో ఒక్కసారిగా పోలీసులు ధర్నా వద్దకు చేరుకొని విద్యార్థి సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. ముందు పుస్తకాల విక్రయాలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. విద్యాహక్కు చట్ట ప్రచారం పాఠశాలల్లో పుస్తకాలు విక్రయించేందుకు వీలులేదని చెప్పారు. అప్పటివరకు ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. దాంతో నాయకులను అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థి సంఘాల నాయకులు స్వాధీనం చేసుకున్న పెన్సిల్‌ బాక్సులు, నోటుపుస్తకాలు, పాఠ్యపుస్తకాలను పాఠశాల యాజమాన్యానికి పోలీసులు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా పాధ్యక్షులు మస్కు చరణ్‌ మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా విద్యాధికారి నిర్లక్ష్యం కారణంగా విద్యాహక్కు చట్టానికి తూట్లు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకు పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపడం లేదని ప్రశ్నించారు. విక్రయిస్తున్న పాఠ్యపుస్తకాలను పట్టుకుని విద్యాశాఖ అధికారులకు అప్పగించిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. జిల్లా విద్యాధికారి ఏ ఒక్కరోజు కూడా ప్రయివేటు పాఠశాలలను ఎందుకు తనిఖీ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రయివేటు పాఠశాలల యాజమాన్యం ప్రభుత్వం చేతిల్లో లేదా అని ప్రశ్నించారు. అలాంటి అప్పుడు ప్రభుత్వం ఎందుకు గుర్తింపులిస్తుందని నిలదీశారు. ఒకటో తరగతి విద్యార్థులకు రూ.6000 నుంచి రూ.10వేల వరకు పుస్తకాల రూపంలో డబ్బులు వసూలు చేస్తూ విక్రయాలు కొనసాగిస్తున్నారని చెప్పారు. ఓ రకంగా పాఠశాల ఫీజు కంటే పుస్తకాలకు చెల్లిస్తున్న ఫీజు అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలలో పుస్తకాల ఇష్టానుసారంగా పుస్తకాలతో దందా చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రయివేటు పాఠశాలల పుస్తకాల దందాను ఆపాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా అధిక ఫీజులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఏర్పుల తరంగ్‌, మద్దెల శ్రీకాంత్‌, నాయకులు లక్ష్మణ్‌, వర్షిత్‌, విక్రం, రాకేష్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.