నారాయణ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నారాయణ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శనివారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.ఎల్‌.మూర్తి, కార్యదర్శి పి.నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. నారాయణ మాదాపూర్‌ బ్రాంచ్‌లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన కనకరాజు కుటుంబాన్ని ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఐదుగురు ఆత్మహత్య చేసుకోగా, నారాయణ విద్యా సంస్థల్లో ఇది రెండోదని తెలిపారు. వీటిపై ప్రభుత్వం, ఇంటర్‌ విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేదని విమర్శించారు. ఇండ్లకు వెళ్లి వచ్చిన విద్యార్థులను వెంటనే ఫీజులు చెల్లించాలని తీవ్రంగా వేధిస్తూ ప్రాణాలను తీసు కుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి కళాశాలలో కౌన్సిలింగ్‌ కోసం కౌన్సిలర్లను నియమించాలని హెచ్చరిం చినా కార్పొరేట్‌ కళాశాలలు పాటించడం లేదని చెప్పారు.
నారాయణ విద్యాసంస్థలను నిషేధించాలి
నారాయణ విద్యాసంస్థలను నిషేధించాలనీ, ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పి.మహేష్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. నిషేధం విధించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.