నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు, రియంబర్స్మెంట్ మెస్ కాస్మోటిక్ ఛార్జిలను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ అన్నారు. సోమవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులతో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా 7200 కోట్ల ఉపకార వేతనాలు బకాయిలగా ఉన్నాయన్నారు.గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలన వంద రోజులు అవుతున్నప్పటికీ విద్యార్థులకు అందజేయాల్సినటువంటి ఉపకార వేతనాలు అందజేయకపోవడం సరైంది కాదన్నారు.ఒకవైపు యాజమాన్యాలు విద్యార్థులను ఫీజుల పేరుతో పీడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారన్నారు. సంక్షేమ వసతి గృహాలకు పక్కా భవనాలను నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని, ఎస్వీ ఎయిడెడ్ డిగ్రీ కళాశాల ను ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మార్చాలన్నారు. ప్రైవేట్ మరియు ఎఇడెడ్ కళాశాలలు విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ బృందం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు,అక్కినపల్లి వినయ్, యాతాకుల ప్రవీణ్, తాళ్ల వినయ్, విష్ణు తన్వేష్ సిద్దు తేజ భాస్కర్ నరేష్ అర్జున్ ఆదిల్ విజయలక్ష్మి సింధు సబియా హిందూ నవ్య సౌమ్య అంజలి తదితరులు పాల్గొన్నారు.