నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యా లయం (హెచ్‌సీయూ) విద్యార్థి రోహిత్ వేములపై బీజేపీ నాయకులు, నాటి వీసీ వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన కులం గురించి అబద్ధం చెప్పాడంటూ అందుకే భయపడి చనిపోయాడంటూ 60 పేజీల నివేదికను పోలీసులు కోర్టుకు సమర్పించారని పేర్కొన్నారు. రోహిత్ వేముల కులం గురించి కాకుండా బండారు దత్తాత్రేయ, రామచంద్రరావు, నాటి వీసీ అప్పారావు, ఏబీవీపీ నాయకుల వేధింపులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోలీసుల విచారణ నివేదిక బీజేపీ స్క్రిప్టులాగా ఉందని విమర్శించారు. ఆ కేసును పునర్విచారణ చేయడాన్ని, హైకోర్టులో పోలీసులు రిట్ పిటిషన్ దాఖలు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఆయన ఆత్మహత్యకు కారణమేంటీ?, ఆ సందర్భంలో ఆయన రాసిన లేఖలో వివక్ష గురించి విచారణ జరపాలని కోరారు. రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాల్లో రోహిత్‌లాగా ఆత్మహత్యలు చేసుకోకుండా ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రోహిత్ చట్టాన్ని తేవాలని కోరారు.
నిష్పాక్షిక దర్యాప్తు జరపాలి : ఏఐఎస్‌ఎఫ్
హెచ్‌సీయూలో కులవివక్షకు గురై సంస్థాగత హత్య చేయబడ్డ రోహిత్ వేముల కేసును పునర్విచారించాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన హత్యపై నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని కోరారు. ఆయన ఎస్సీ కాదంటూ పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించి కేసును మూసేయడాన్ని ఖండించారు. పోలీసుల తీరుతో విద్యార్థిలోకం నిరాశకు లోనైందని తెలిపారు. ఆయన హత్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలనీ, రోహిత్ వేముల చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు.
రోహిత్‌ది వ్యవస్థీకృత హత్య : పీడీఎస్‌యూ
రోహిత్ వేములది ముమ్మాటికీ వ్యవస్థీకృత హత్య అని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయల పరశురాం విమర్శించారు. ఆ కేసును రీఓపెన్ చేయడంతోపాటు నిష్పక్షపాతంగా విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నాటి వీసీ అప్పారావు, ఏబీవీపీ నాయకులు సుశీల్, బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, స్మృతీఇరానీ, రామచంద్రరావుల ప్రత్యక్ష, పురోక్ష వేధింపుల కారణంగా ఆత్మహత్యచేసుకున్నాడని విమర్శించారు. పోలీసులు బాధ్యతారహితంతో తప్పుడు నివేదిక ఇవ్వడం సిగ్గుచేటని తెలిపారు. ఇది ఎన్డీయే ప్రభుత్వ కనుసన్నల్లో రూపొందించారని పేర్కొన్నారు.
రోహిత్ వేముల కేసును పారదర్శకంగా దర్యాప్తు జరపాలి : పీడీఎస్‌ఎఫ్
రోహిత్ వేముల కేసును పారదర్శకంగా దర్యాప్తు జరపాలని పీడీఎస్‌ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు మారికంటి హరీశ్ డిమాండ్ చేశారు. నిందితులను రక్షించే విధంగా పోలీసులు నివేదికను రూపొందించారని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కొంతమందిని రక్షించే విధంగా ఏకపక్షంగా ఉన్న పోలీసుల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కేసును పునర్విచారించాలని కోరారు.