– రేవంత్‌రెడ్డి వస్తే.. గంపకింద కమ్ముదాం
– అదానీ పంపుతున్న సిమెంట్, సలాకా పంచుతున్న బీజేపీ
– కేసీఆర్ గెలిస్తే.. దళితులకు అసైన్డ్ భూములిస్తం: కేటీఆర్
నవతెలంగాణ-భిక్కనూర్/దోమకొండ
‘గంప గోవర్ధన్ చేతిలో మూడుసార్లు ఓడిపోయిన షబ్బీర్ అలీ కేసీఆర్‌పై గెలవడం కష్టమని నిజామాబాద్‌కు వెళ్తున్నట్టు తెలిసింది. కేసీఆర్‌పై పోటీ చేయడానికి రేవంత్‌రెడ్డి వస్తుండట. ఈసారి కూడా అదే గంప కింద రేవంత్‌రెడ్డిని కప్పి పెట్టాలి’ అని మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. గంపగోవర్ధన్ కోరిక మేరకే కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని, లక్ష మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూర్, దోమకొండ మండల కేంద్రాల్లో బుధవారం ప్రజాఆశీర్వాద సభలకు కేటీఆర్ హాజరై ప్రసంగించారు.
అదానీ పంపిస్తున్న సలాకా సిమెంటును బీజేపీ అభ్యర్థి పంపిణీ చేస్తున్నారని, దాన్ని ప్రతి ఒక్క కుల సంఘం తీసుకోవాలని, ఎన్నికల్లో మాత్రం బీఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలను చూసి ప్రజలు ఓటు వేస్తారని తెలిపారు. కేసీఆర్ కామారెడ్డి నుండి పోటీ చేసి గెలిస్తే కామారెడ్డిలో ఉన్న ప్రభుత్వ భూములు అమ్మేస్తారని ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాటలు నమ్మవద్దని, కామారెడ్డి నుంచి కేసీఆర్ గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఉన్న అసైన్డ్ భూములు దళితులకు ఇవ్వనున్నట్టు తెలిపారు. కేసీఆర్‌ను ఢకొీట్టడానికి ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారని, కానీ కేసీఆర్ లోకల్ అని, రాష్ట్ర ప్రజల మధ్యలో ఉండి దేశానికి తెలంగాణ దిక్సూచిగా అభివృద్ధి చేయడం ఖాయమని స్పష్టం చేశారు. ఎవరెన్ని చెప్పినా, ఎవరు ఎన్ని డబ్బులు పంపిణీ చేసినా.. ఎన్నికల్లో మాత్రం కేసీఆర్‌ను లక్ష మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు సూచించారు.
మా పూర్వికుల స్వస్థలం కోనాపూర్
కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ మండలం పోసానిపల్లి గ్రామంలో మా నాయనమ్మ ఉండేవారని, నిజాం ప్రభుత్వం హయాంలో మానేరు ప్రాజెక్టులో మా భూములు కోల్పోవడంతో, నాటి నిజాం ప్రభుత్వం ఇచ్చిన ఊ.1.80 లక్షలతో చింతమడక గ్రామానికి వలస వెళ్లినట్టు కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ గెలిస్తే.. గజ్వేల్, సిద్ధిపేట కన్నా కామారెడ్డి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. దోమకొండను మున్సిపాలిటీ చేయాలని, మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ గంపగోవర్దన్ కోరగా.. ప్రభుత్వం ఏర్పాటు తరువాత వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇతర పార్టీల నుంచి భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఉర్దూ చైర్మెన్ ముజీబుద్దీన్, మాజీ ఫుడ్ కమిటీ చైర్మెన్ తిరుమల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మెన్, మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, పట్టణ సర్పంచ్ తునికి వేణు, ఎంపీపీ గాల్ రెడ్డి, జడ్పీటీసీ పద్మ నాగభూషణం గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ కృష్ణ గౌడ్, సిద్ధ రాములు తదితరులు పాల్గొన్నారు.