నిస్సార బతుకు

Shallow livingమనిషిగా అన్నం తింటున్నప్పుడు
దేశానికి కన్నం వేస్తున్న
దోపిడి దొంగల్ని చూడవా…?
దొపిడి అనంతమైతే
నీకు నాకే కాదు
రాసులు పండించే రైతుకూ అన్నం దక్కదు.
చేతికి నోటికి మధ్య ముద్దను
‘ఆ’ గద్దలే తన్నుకుపోతాయి
మార్కెట్‌ మాయను
గమనించకపోతే ఎలా…?
ఎంతకాలం మూఢనమ్మకాల
ప్రాప్తకాలజ్ఞత
ముసుగు దుప్పట్లో దాక్కుంటావు?
పోరాట చేతనం లేని
నిర్జీవ నిస్సార బతుకు
అసహ్యం కాదా…?
నీవు సరే! నీ పిల్లలకూ అదే గతా..?
ఆ లేత కళ్లల్లోకి సూటిగా చూడు.
నీ భయాన్ని పిరికితనాన్నే
నూరి పోస్తున్నావుగా…
జీవితం పట్ల ఆశను ధైర్యాన్ని
చిగురింప చేయవా…?
ప్రాపంచిక దృక్పథం కరువైతే
కడకు మిగిలేది కటిక భయమే!
పోరాట వెలుగు కనలేకపోతే
అలముకునేది అంధకారమే!
– కె.శాంతారావు, 9959745723