శంభాజీ మహారాజ్‌ జీవితం అధారంగా ‘ఛావా’

'Chava' is based on the life of Shambhaji Maharaj.విక్కీ కౌశల్‌, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’. దినేష్‌ విజన్‌ నిర్మాతగా లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 14న రిలీజ్‌ కాబోతోంది.
ఛత్రపతి శివాజీ మహారాజ్‌ తనయుడు శంభాజీ మహారాజ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలోని ‘జానూ తూ..’ అంటూ సాగే సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ను చిత్ర బృందం శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించింది.
అయితే కాలికి గాయమై నొప్పితో ఉన్నప్పటికీ కథానాయిక రష్మిక మందన్న వీల్‌చైర్‌లో ఈ ఈవెంట్‌కి రావడం అందర్నీ సర్‌ప్రైజ్‌ చేసింది.
ఈ సందర్భంగా హీరో విక్కీ కౌశల్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రిపేర్‌ అయ్యాను. యుద్ధాలు, గుర్రపు స్వారీల్లో శిక్షణ తీసుకున్నాను. అన్నింటికిమించి ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ అనే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం, నా మనసుని ఆ పాత్ర కోసం సన్నద్ధం చేసుకోవడం సవాలుగా అనిపించింది. దర్శకుడు లక్ష్మణ్‌ మొదటి నుంచి కూడా నన్ను పాత్ర పేరుతోనే పిలుస్తుంటారు. నేను ఈ పాత్రను పోషించగలను అనే నమ్మకాన్ని అలా ఆయన నాలో ముందు నుంచీ కలిగిస్తూనే వచ్చారు. నిజమైన యోధుల కథను చెబుతున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించిన దినేష్‌ విజన్‌కి, తెరకెక్కించిన లక్ష్మణ్‌కి ధన్యవాదాలు. రెహమాన్‌ సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ఇలాంటి పాత్ర నాకు దొరకడం నా అదష్టం. జీవితంలో ఒక్కసారే ఇలాంటి అవకాశం వస్తుంది. ఈ మూవీ చాలా గొప్పగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.
‘ఈ చిత్రంలో మాటలకు అందని భావం ఉంటుంది. అలాగే ఓ దైవత్వం ఉంటుంది, అంతులేని ప్రేమా ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని చేయాలని ఫిక్స్‌ అయ్యా. ఫిక్షనల్‌ క్యారెక్టర్ల విషయంలో కొన్నింటిని మేనేజ్‌ చేయొచ్చు. కానీ నిజ జీవిత పాత్రలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయలేం. అందుకే మహరాణి యేసుబాయి పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. ఈ మూవీని చూసిన ప్రతీ సారీ నేను ఏడ్చేస్తాను. అంత అద్భుతంగా ఉంటుంది. రెహమాన్‌ మ్యూజిక్‌, ‘జానే తూ..’ పాట అందరినీ మెస్మరైజ్‌ చేస్తుంది. విక్కీ చుట్టూ అద్భుతమైన ఆరా ఉంటుంది. ఆయన పక్కన నిలబడితేనే ఓ మ్యాజిక్‌ జరుగుతుంది. ఛావా పాత్రకు విక్కీ అద్భుతంగా సెట్‌ అయ్యారు. అందుకే విక్కీని లక్ష్మణ్‌ ఈ పాత్రకు తీసుకున్నారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’ అని రష్మిక మందన్న చెప్పారు.