దేశంపై తన నిరంకుశాధిపత్యాన్ని రుద్దడానికీ, ప్రత్యక్ష పరోక్ష పద్ధతులలో ప్రత్యర్థులపై ప్రతిపక్షాలపై దాడి చేయడానికి మోడీ ప్రభుత్వం ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా వుందని ఈ వారం రోజుల పార్లమెంటు సమావేశాలు హెచ్చరిస్తున్నాయి. ఆఖరుకు అనుకున్నదాని కన్నా ముందే ఆర్థంతరంగా ఏకపక్షంగా వాటిని ముగించి, కీలక చర్చలన్నింటికీ మంగళం పాడటం వ్యూహాత్మకంగా జరిగిందే. అటు రాజ్యాంగానికి ఎసరు పెడుతూ రాజకీయ రభస రగిలించడమే గాక భౌతికంగా ఇటు రాష్ట్రాల్లోనూ, అటు రాజధానిలోనూ బీజేపీ-సంఘ్ పరివార్ ప్రయోగిస్తున్న పాచికలు అన్నీఇన్నీ కావు. బడా మీడియా, అనేక కీలక ప్రాంతీయ పార్టీలూ వంత పాడుతున్నాయి గనక సామాన్య ప్రజలకు వీటి తీవ్రత అందకుండా పోతున్నది. ఒకదానికి ఒకటి అడ్డం పెడుతూ అనుకున్న దిశలో బండి నడిపించుకోవడానికి బీజేపీ- ఎన్డీయే భాగస్వాములను కూడా మద్దతుదారులుగా మార్చుకుంటున్నది. దేశ చరిత్రలోనే లేని విధంగా పార్లమెంటు వేదికపై అడ్డుకోవడాలు, అఘాయిత్యాలు జరిగినా తెలుగురాష్ట్రాల్లో కీలక ప్రాంతీయపార్టీలు నోరు మెదపకపోవడం ఇందుకో ఉదాహరణ మాత్రమే. తెలుగుదేశం, జనసేన నేరుగా ఎన్డీయేలో వుండి బలపరుస్తుంటే వైసీపీ బయటనుంచి తోడు నిలుస్తున్నది. బీఆర్‌ఎస్ అటూ ఇటూ కాకుండా కాంగ్రెస్, బీజేపీ ఒకటననే వింతవాదనతో పరోక్షంగా సహకరిస్తున్నది. ప్రాంతీయ ప్రత్యర్థుల మధ్యనే ప్రదక్షిణలు చేస్తున్న తెలుగు మీడియా జాతీయస్థాయి చర్చలో స్పష్టమైన కోణాలను చూపించ కుండా రాష్ట్ర రాజకీయాల స్థాయికి దించేస్తున్నది. అందుకే ఇది తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి లోతుగా చర్చించాల్సి వుంది.
అదానీ టు సొరేస్
ఈ సమావేశాలు మొదలవడానికి ముందే అదానీ భాగోతం అమెరికాలో భగ్గుమన్నది. మోడీ నుంచి జగన్ వరకూ విస్తరించిన ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశం చర్చకు చేపట్టాలని ప్రతిపక్షాలు ఎంతగా పట్టుపట్టినా, పోరాడినా మొండిగా నిరాకరించిన బీజేపీ కుయుక్తులతో రాజ్యాంగ ఏర్పాటు 75వ వార్షికోత్సవాల ప్రహసనం చేపట్టి ప్రవచనాలు గుప్పించింది. నెహ్రూపై ద్వేషపూరితమైన వ్యాఖ్యలతో విషం కక్కింది. అదానీపై చర్చను పక్కదోవ పట్టించడం కోసం జార్జి సోరేస్ కథనం తీసుకొచ్చి సోనియాగాంధీ,కాంగ్రెస్‌లతో పాటు లౌకిక పక్షాలు కూడా ఆయన తరపున పనిచేస్తున్నారని దుష్ప్రచారానికి దిగింది. గతంలో సమాంతర మీడియాపై దాడికి కూడా ఇదే వాదన చేయడం గుర్తుండి వుంటుంది. ఏతావాతా సోరేస్‌తో చేతులు కలిపి భారతదేశానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయనేది సంఫ్‌ుపరివార్ అల్లుతున్న అబద్ద పురాణం. అదే నిజమైతే పదేండ్లుగా అప్రతిహత అధికారం చెలాయిస్తున్నవారు ఎందుకు శోధించి బయటకు తీయలేక పోయారు? న్యూస్‌క్లిక్, వైర్ వంటివాటికి ఆండగా వున్న సింగం చైనా ఏజెంట్ అంటూ ఇదే ప్రచారం చేశారు గాని చివరకు చెప్పిందేమీ లేదు.ఇప్పుడు తామే చైనాతో సాధారణ సంబంధాలకు చొరవ తీసుకున్నారు. దేశద్రోహులుగా ప్రతిపక్షాలపై ముద్రవేయడం ఒక పథకం ప్రకారం సాగుతున్న కుట్ర. సీపీఐ(ఎం) సభ్యుడు జాన్‌బ్రిటాస్ రాజ్యసభలో దీనిపై చక్కటి చురకవేశారు. నెహ్రూ వ్యతిరేక ప్రచారం కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖనే ఏర్పాటు చేస్తే పోతుందని ఆయన అన్నారు.మాజీ ప్రధాని వాజ్‌పేయి స్వయంగా రాజ్యసభలో ఒకప్పుడు నెహ్రూను రాముడితో పోల్చారని, అలాంటి నెహ్రూ ఇప్పుడు రావణుడై పోయాడని వ్యాఖ్యానించారు. కేరళలో నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని రద్దు చేసిన నెహ్రూతో తమకు విభేదాలున్నాయి. కానీ, ఆయనపై ద్వేషప్రచారానికి తాము వ్యతిరేకమన్నారు. ఎమర్జెన్సీని తాము వ్యతిరేకిం చాము కానీ, ఇప్పుడు దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని హెచ్చరించారు. 56 అంగుళాల చాతీ గల ప్రధాని హయాంలో బయటనుంచి ఎవరో మన దేశాన్ని అస్థిరపర్చే కుట్ర చేస్తున్నారని చెప్పుకోవడం అవమానం కాదా? అని బ్రిటాస్ వేసిన ప్రశ్న ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యమే. సొరేస్‌తో సంబంధాలు దేశద్రోహం వంటి అంశాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)వేయాలని కోరారు. ఆ కమిటీ పత్యేక దర్యాప్తు చేపడితే ఆ మూలాలు మోడీ ఇంటి దగ్గరే తేలతాయని బ్రిటాస్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే మనం ఐక్యరాజ్యసమితి ప్రజాస్వామ్య నిధికి విరాళం ఇస్తున్నాం. దానికీ సొరేస్‌కూ సంబంధం వుంది. మరి మనమే ఆయనకు డబ్బు పంపుతున్నామా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో అమెరికా పాత్ర గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అదానీ గురించి విస్తారంగా వచ్చినదాన్ని దాటేసి కృత్రిమంగా సొరేస్ రచ్చ ఎందుకు తెచ్చినట్టు?ఇటలీ వెబ్‌సైట్ మీడియాపార్ట్ రఫేల్ హెలికాప్టర్ల గురించి బయటకు తీసినదాన్ని వదలిపెట్టి సోరేస్‌పై ఏదో రాసిందని ఇక్కడ మీడియాలో కథనాలు వదిలింది. తమ పేరును అనవసరంగా తీసుకొస్తున్నారని మీడియా పార్ట్ ఖండన కూడా ప్రకటించింది.
అంబేద్కర్‌కు పోటీగా దేవుడు
సొరేస్ అస్త్రం, అదానీ కథనం నుంచి కాపాడలేక పోవడం, రాజ్యాంగ చర్చ కూడా రాజకీయంగా దారి తప్పించకపోవడంతో మోడీ సర్కార్ వ్యూహాలకు చుక్కెదురైంది. జమిలి బిల్లును ఆలస్యం చేసి మరీ రాజ్యాంగ చర్చను సాగదీయాలని మొదట భావించి ఆ మేరకు ప్రకటించారు. అయితే ఈ క్రమంలో అంబేద్కర్ వివాదం స్వయంగా అమిత్ షా ద్వారానే తెరపైకి తెచ్చారు. రాజ్యాంగాన్ని రూపొందించడం ద్వారా హక్కులు కల్పించిన అంబేద్కర్ పేరు చెప్పడాన్ని ఫ్యాషన్‌గా చిత్రిస్తూ దానికి బదులు దేవుడి పేరు అన్నిసార్లు తల్చుకుని వుంటేనన్నా పుణ్యం వచ్చేదని చెప్పడమంటే అర్థమేమిటి? ఇందులో వున్నదీ మత రాజకీయమే. అమిత్ షా వక్రవ్యాఖ్య దేశ వ్యాపిత నిరసనలకు కారణమవడంతో బీజేపీ వ్యూహాలు బెడిసికొట్టాయి. దాంతో ఆలోచన మార్చుకుని ఆదరా బాదరగా జమిలి బిల్లునే సభలో ప్రవేశపెట్టారు. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడానికి పాటించాల్సిన నిబంధనలకు తిలోదకాలు వదిలి మొండిగా ముందుకు తెచ్చారు.అయితే దాన్ని జేపీసీకి పంపించడం ప్రజాసామ్యం కోసమేనన్నట్టు కొత్తనాటకం నడిపించారు.అయినా అసలు వుద్దేశం బయటపడిపోయిందన్న నిస్పృహతోనే నేరుగా ప్రతిపక్ష నేతను అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు. రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే సభలోకి వస్తుంటే మకరద్వారం దగ్గర అయిదుగురు బీజేపీ సభ్యులు అడ్డుతగలడమేమిటి? ఇలాంటిది గతంలో ఎప్పుడైనా జరిగిందా? తర్వాత బీజేపీ సభ్యులు ప్రతాప్ చంద్ర సారంగి,ముఖేష్ రాజ్‌పుత్ గాయపడ్డారంటూ ఆయనపై నాలుగు సెక్షన్ల కింద కేసు పెట్టారు. వారు అడ్డుకోవడం వల్లనే ఘర్షణ జరిగిందని, తనకూ గాయమైందని ఖర్గే ప్రకటించారు. కాంగ్రెస్ సభ్యులు దీనిపై ఎదురు కేసు పెట్టారు. కానీ పోలీసులు కేవలం పాలకపక్షం ఫిర్యాదులపైనే దర్యాప్తు చేస్తూ తమ ఫిర్యాదులను పెడచెవిని పెట్టారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ ఘర్షణలను సాకుగా చూపించి సభను ముందే వాయిదా వేశారు. అంతేగాక పార్లమెంటు ప్రాంగణంలో నిరనసలు నిషేధిస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఇది ఎప్పటినుంచో వున్న సంప్రదాయాలను హక్కులను నిరాకరించడమే.నిరసనల పట్ట మోడీ సర్కారు ఎంత అసహనంగా వుందో దీంతోనే తెలిసిపోతున్నది. ఇక రాజ్యసభ చైర్మన్ జగదీప్‌ధంకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసును తిరస్కరించడం ఇంకో పరిణామం.పైగా సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం తగదని ఆయన సూక్తులు చెబుతూ సభను ముగించారు.ఉభయ సభల్లోనలూ నిరసనలు లేకుండా అడ్డుకోవడం, ప్రతిపక్షాలు ఎంత అభ్యర్థించినా న్యాయమైన చర్చలకు అనుమతించ కుండా వాటిపైనే విద్రోహం ఆరోపణలు చేయడం బీజేపీ ఇరకాటానికి అద్దం పట్టింది. చర్చలు సవ్యంగా జరిగితే ఎదుర్కోలేమన్న భయంతోనే ముందే అడ్డుకోవడం ఇక్కడ వ్యూహం.అంతా అయ్యాక రాజ్యసభ 60 శాతం,లోక్‌సభ 45 శాతం సమయం వృథా అయిందని, పెట్టిన 16బిల్లులలో ఒక్కదాన్నే ఆమోదించగలిగిందని మొసలికన్నీళ్లతో నివేదికలు విడుదలయ్యాయి. అంబేద్కర్‌ను అవమానించినందుకు క్షమాపణలు చెప్పడం కానీ, కనీసం సర్దిచెప్పడం కానీ ఇప్పటికీ జరగలేదంటే మనువాద సిద్ధాంతకర్తల నిజస్వరూపం ఏమిటో తెలుస్తోంది. నిజానికి 1992లో అంబేద్కర్ వర్థంతి రోజైన డిసెంబర్6న బాబ్రీ మసీదు విధ్వంసానికి పాల్పడినప్పుడే వారు లౌకికతత్వంతో పాటు పార్లమెంటరీ ప్రజాస్యామ్యంపైనా, అంబేద్కర్‌పైనా తమకు ఏమాత్రం గౌరవం లేదని చేతల్లో చెప్పేశారు.
డబుల్ గేమ్
రాహుల్‌గాంధీపై కేసును నేరపరిశోధన విభాగానికి అప్పగించారు గనక ఏ మలుపు తిప్పుతారనేది చెప్పలేం. కాంగ్రెస్ వైపునా ఏమైనా లోపాలుంటే వుండొచ్చుగానీ అసలైన బాధ్యత అధికార పార్టీదే. ఇదే సమయంలో ఆరెస్సెస్ అధినేత మోహన్‌భగవత్ ప్రతి మసీదు కింద మందిరాలున్నాయని వివాదాలు విస్తరించడం సరికాదని నీతిపాఠాలు చెప్పడం కూడా సందేహాలు పెంచింది. ఎందుకంటే అన్నిచోట్ల కాదు కొన్నింటిపై కేంద్రీకరించాలనే వ్యూహం తీసుకోబోతున్నట్టు కనిపిస్తున్నది.అయోధ్య తర్వాత కాశీ మధు బాకీ హై అన్న వారి ప్రచారం బాగా తెలిసిందే గనక ఆ దిశలో వ్యూహాలు నడవొచ్చు. సంభాల్‌లో మసీదు సర్వేను సుప్రీంకోర్టు నిలిపేసినా అదే చోట మరేదో మందిరం బయటపడిందంటూ జాతీయ స్థాయిలోనే హడావుడి సాగిస్తున్నారు. అక్కడ సర్వేలు మొదలెట్టారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ యాదవ్ విహెచ్‌పి సభలో విద్వేష ప్రసంగం చేయడాన్ని సుప్రీంకోర్టు కొలీజియం పిలిచి మందలిస్తే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమర్థిస్తున్నారు. మసీదులు, మందిరాలపై మోహన్ భగవత్ మాట్లాడిన దానికి భిన్నంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. ఈ ద్వంద్వ క్రీడ మనకు బాగా పరిచితమైన సంఘ్ పరివార్ పని విభజనలో భాగమే. తమ వాదనలు, వ్యూహాలు దాడులపై నిరసన వస్తున్నది గనకే సన్నాయి నొక్కులపని ఒకరు తీసుకుంటే మరొకరు షరామామూలుగా విద్వేషకాండ సాగిస్తున్నారని అర్థం చేసుకోవాలి. తిరుమల కొండపై అన్యమత ఉద్యోగుల తొలగింపు అంటూ మొదలుపెట్టి ఇప్పుడు షికారి తెగవారిపై ఆ ముద్రవేసి దుకాణాలు మూయించి వెళ్లగొట్టడం దేనికి నిదర్శనం? సనాతన మతమే భారతీయుల జాతీయ మతమని యోగి ఆదిత్యనాథ్ ఉవాచ.ఒకే దేశం,ఒకే ఎన్నిక, ఒకే మతం, ఒకే పార్టీ, ఒకే నేత అనే నినాద పరంపరకు పరాకాష్ట కాగానే వీటిని చూడకతప్పదు.ఇంతా చేసి లోక్‌సభ లో మెజార్టీ కోల్పోవడం, రాజ్యసభలో అసలే లేకపోవడం బీజేపీకి మింగుడుపడని పరిస్థితిగా తయారైంది. తత్ఫలితంగానే పార్లమెంటును రణక్షేత్రంగా మార్చేందుకు సిద్ధమైపో యారని తాజా సమావేశాలు చేసిన హెచ్చరిక.
తెలకపల్లి రవి